పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“తల్లీ! నీ వార్తలన్నీ చాలా ముఖ్యాంశాలను తెలుపుతున్నాయి. వాని విషయంలో నేను తగు శ్రద్ధవహిస్తాను.”

“నాన్నగారూ! ప్రజలందరూ ముక్త కంఠంతో తాము సర్వభారతానికీ ఏకచ్ఛత్రాధిపత్యం వహించకోరుచున్నారని నలుమూలలనుండి వార్తలు వస్తున్నాయి.”

“అవును తల్లీ! రాజపదవే ముళ్ళదారి, ఇంక సార్వభౌమపదవి కత్తుల దారే!”

“అయినా ఎవరో ఒకరు ఆ కత్తులదారి శుభ్రం చేస్తూ. ధర్మం నిలబెట్టవద్దా నాన్నగారూ?”

“బుద్ధభగవానుడు రాజ్యం వదిలివేసి ఎందుకు ధర్మపథం కనుక్కోవడానికి వెళ్ళినాడు తల్లీ!”

“ఈ ప్రపంచంలోని దుఃఖాలను నాశనం చేయడానికి సన్యాసమొక్కటే మార్గం కాదుకదా? జగజ్జీవులు ప్రపంచ వాసనలు వదులుకోలేరు. వాళ్ళకోసం, ఉత్తములు ధీరోదాత్తులు రాజ్యాధిభారాలు వహించి ధర్మం నాలుగుపాదాలా నడపేందుకు సిద్ధంకావాలి అని మా దేశికులు సెలవిచ్చారు.”

“ఎవరు? అర్హతాచార్యులా?”

“కాదు నాన్నగారూ! శ్రీ బ్రహ్మదత్తప్రభువులు!”

తండ్రికడ సెలవు పొంది, ఆ సౌందర్యనిధి, అద్భుత జ్ఞానసంపన్న శాంతిశ్రీకుమారి తన అంతిపురానికి వెళ్ళి తన గురువు బ్రహ్మదత్తుడు తనకై ఎదురుచూచే విద్యామందిరం చేరుకున్నది. బ్రహ్మదత్త ప్రభువు చిరునవ్వుతో "రాజకుమారీ! రాత్రి ఎన్నిసార్లు త్రిస్థాయిలూ, త్రికాలాలూ, అభ్యాసం చేశావు?” అని పృచ్ఛచేసినాడు. “వేయిసార్లు త్రిస్థాయిలూ, త్రికాలాలూ వీణమీద అభ్యాసం చేశాను. వేయిసార్లు కంఠంతో. వేయిసార్లు రెండూకలిపి చేసాను” అని ఆనందంతో వికసించిన మోముతో పలికింది.

“అలా కృషి చేసినట్లయితే ఏలాంటి విద్య అయినా నిముషంలో కరగతమైపోతుంది, రాకుజమారీ!”

“నాకు కొన్ని అనుమానాలున్నాయి గురుదేవా! మీరు నాట్యమూ నాట్యాను బంధాలయిన సంధితాదులూ యజ్ఞయాగాది క్రతువుల కాలంలో ప్రదర్శితమయ్యే ఉత్తమ విద్యలన్నారు....”

“అవును.”

“కాని మారదేవుడు తన కొమరితలను ఆ విద్యలలో ప్రజ్ఞాపూర్ణలుగాచేసి బుద్ధదేవుని తపస్సు విఘ్నం చేయడానికి వారిని ప్రయోగించినాడుకదా?”

“నీ అనుమానం సమంజసమైనదే. నాట్యమూ, గాంధర్వమూ, శిల్పమూ ఇవన్నీ ఉపవేదాలు అనే భావం ఋషులకాలంనుంచి ఉన్నది. యజ్ఞయాగాది క్రతువులు పశుహింసాత్మకాలని మహాశ్రవణకుడు సెలవిచ్చినాడు. ఛాగాదులను కుక్కుటాదులను, మీనాదులను అనేకులు భోజనానికై ఉపయోగిస్తున్నారు. యాగాదులు చేసేటప్పుడు బ్రహ్మజ్ఞానులైన బ్రాహ్మణులు కూడా మేకను, గుఱ్ఱమును, చివరకు నరుణ్ణికూడా యాగపశువును చేశారు.”

అడివి బాపిరాజు రచనలు - 6

190

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)