పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/196

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నవమ భాగం

ప్రజాకంఠము

గ్రామగ్రామాలలో ప్రజలు సభలు చేసినారు. పంచసభ్యుల్ని తమ పక్షాన ధాన్య కటకానికి ప్రయాణం కమ్మన్నారు. ఒక్కసారిగా నేల ఉప్పెన పొంగినట్లు గ్రామగ్రామాలలో ఆబాలగోపాలములోనూ ఆవేశం పొంగులు వారింది.

ధనకసీమ, వజ్రభూమి, పూంగీయ విషయము, క్రముకరాష్ట్రం, వేంగీ విషయం, బృహత్పాలాయన విషయం, దక్షిణకళింగ, దక్షిణకోసల, చోడ విషయం, చాళుక్య విషయం, కొరవిరాష్ట్రాదులలోని వేలకొలదిగ్రామాల నుంచి గ్రామపెద్దలు బయలుదేరినారు. గుఱ్ఱపు బళ్ళమీద, ఎద్దులబళ్ళమీద, గుఱ్ఱాలపైన, ఏనుగులపైన, కాలినడకల బయలుదేరినారు. దారిలో భజనలు చేసుకుంటూ, ఇతర గ్రామాలవారిని సంప్రదిస్తూ, ధాన్యకటకం చేరవస్తున్నారు. నలవైపులనుండి వస్తున్నారు. శివుని, విష్ణుని, తథాగతుని, తీర్థంకరులను ప్రార్థిస్తూ వస్తున్నారు. కొందరు క్షద్రదేవతల భజనలు చేస్తున్నారు.

ఆ నడివేసవిలో ఎండనక, ఏరనక, కొండనక, అడవనక గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, వస్తున్నారు. ధాన్యకటకానికి అప్పుడే కొన్ని గ్రామాలవారు చేరారు. మాళవికాదేవి అపరాజితయే అన్నారా ప్రజలు. ఆమె పేరున గుడి సంకల్పించినారు. ఆమె పేరున కృష్టఒడ్డున పూజలు చేయించినారు. ముత్తయిదువులకు వాయినాలిప్పించినారు. వేలకువేలు జనులు కోటలోనికిపోయి శాంతిమూలమహారాజు దర్శనం కోరినారు. మహారాజు, మంత్రులు, సేనాపతులు, బ్రహ్మదత్తప్రభువు, పూంగీయ మహారాజు, బృహత్పలాయన ప్రభువు, వేంగీపురసాలంకాయన ప్రభువు, పిష్టపుర వాసిష్టప్రభువు, చళుకనాటి చాళుక్యరాయనిక ప్రభువు మున్నగువారితో ఎడతెగని మంతనముంటున్నారు. ప్రజలందరూ ఏకకంఠంతో “జయ శాంతి మూలచక్రవర్తీ!” అని అరచినారు,

“జయ ఇక్ష్వాకుచక్రవర్తీ జయ”

“జయ విజయపుర సింహసనాధీశా!”

అన్న విజయ నాదాలు ఆశావిలసితాయై, ఉప్పొంగి దెసలావరించినవి. ప్రజల జయధ్వానాలు వినగానే శాంతిమూలుని మోము వైవర్ణ్యం పొందింది. పూంగీయ, ధనక, చళుక, సాలంకాయనాది ప్రభువుల మోములు పద్మాలులా వికసించాయి. ఆ గ్రామగ్రామాల ప్రజలు, పెద్దలు ముందుకు వచ్చినారు. ఆ పెద్దలలో ఒక ముదుసలి మహారాజులందరూ నిలుచుండి ఉన్న సభాప్రాంగణంలోనికి పోయినాడు. శాంతిమూలమహారాజుకు సాష్టాంగపడి నమస్కరించాడు, లేచి తక్కిన మహారాజులకు నమస్కరించాడు.

“మహాప్రభూ! తాము ఆంధ్రప్రభువులైన మీరందరు ఈ పెద్దవాని మాట వినండి. నా కంఠంలో నుంచి వచ్చే మాటలు కోట్లకొలది గొంతుకలలో నుంచి వచ్చినవే. శ్రీబుద్ధదేవులు భక్తులతో ఈ జంబూద్వీపం తిరిగే కాలం ముందునుంచీ, శ్రీరామచంద్రుడు

అడివి బాపిరాజు రచనలు - 6
అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)
188