పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాపలాకాస్తున్నారు. కాని పులమావి నిస్పృహ చెందలేదు. శాంతిమూలుని హృదయమూ, చక్రవర్తి చంద్రశ్రీ శాతవాహనుని నికృష్టతా అన్నీ పూర్తిగా పులమావికి తెలుసును. పులమావి చూట్టాలైన ప్రభువులు చాలా మంది ధాన్యకటకంలో ఉన్నారు. పైగా ముసిక నగరంనుంచి అనేకమంది అపసర్పులు మారువేషాలతో నిండిపోయారు. ఏలా వచ్చిందో పులమావికి ఆ బంధనలోనుంచి పారిపోయే విధానం! అయిదు దినాలలో సొరంగం ఒకటి మారుమూల మందిరాలలో నుంచి బంధనాగారానికి చొచ్చుకువచ్చింది. ఆరవదినాన ఉదయమే ఇక్ష్వాకు చారులకు ఆ మహామందిరంలో పులమావి కనబడలేదు.

పులమావి మాయమైనాడన్న సంగతి శాంతిమూల మహారాజుకు చారులు పరుగెత్తుకుని వెళ్ళి నివేదించుకున్నారు. ఇక్ష్వాకుల అపసర్ప నాయకుడు విచారణ చేసి పులమావి రాత్రికి రాత్రే సొరంగము దారిని మాయమై పోయాడనీ, పులమావి బందుగులూ, అపసర్పులూ ఈ ఏర్పాటంతా కావించారనీ మనవి చేసుకున్నాడు. శాంతిమూల మహారాజు ఒక చిరునవు మాత్రం నవ్వి ఊరకున్నారు. అపసర్ప నాయకుని విషాదమంతా మాయమై ఆశ్చర్యము అతనిని ముంచివేసింది.

“ఓయి రాహులశ్రీ! చంద్రశ్రీ చక్రవర్తి విరోధులు దేశమంతటా ఉద్భవించారు. ఆలాంటప్పుడు పులమావి పారిపోవడంలో ఆశ్చర్యమే ముంది? మనం అతనిని బందీగానూ ఉంచలేము, ఇంకోవిధంగా శిక్షించడానికి వీల్లేదు. పారిపోయి మళ్ళీ సేనలను సమకూర్చుకుంటాడు. యుద్ధం కాకతప్పదు, అందులో అతడు నాశనం కాక తప్పదు. మీ చారుల్ని ముసికనగరం పంపించి పులమావి కార్యక్రమం యావత్తూ మా కెప్పటికప్పుడు తెలియచేస్తూ ఉండవలసింది అది ఒకటి. రెండవది - ఈ ఊళ్ళో పులమావి పక్షం వాళ్ళెవరున్నారో వారి జాడ యావత్తూ గ్రహిస్తూ మా కెప్పటివార్తలప్పుడు అందజేస్తూ ఉండండి. ఇవి వెంటనే జరగవలసిన పనులు.” శాంతిమూలుని ఆజ్ఞ శిరసావహించి నమస్కరించి రాహులశ్రీ అపసర్పనాయకుడు పని విన్నాడు. శాంతిమూలుడు తన రెండవరాణి, చక్రవర్తి మేనత్త కుసుమలతాదేవికడకు వెళ్ళినాడు.

కుసుమలతాదేవికి ఇప్పుడు ముప్పది సంపత్సరాలుంటాయి. అందంలో కుసుమలతే! రాణులందరితో తలలో నాలుకలా ఉండి శాంతిమూలునికి తగిన రాణి అనిపించుకున్నది. యజ్ఞశ్రీ శాతకర్ణి చక్రవర్తి తెలివితేటలన్నీ పుత్రునికి రాక కొమరిత అయిన కుసుమలతకు అబ్బినవంటారు. భర్తకు నిజమైన మంత్రి ఈ దేవేరి. చక్రవర్తి కొమరితనని గర్వంలేక ఆమె పట్టపురాణి మాఠరిగోత్రజ అయిన సారసికాదేవిని భక్తితో పూజిస్తూ ఉంటుంది. సారసికాదేవికన్న కుసుమలతాదేవే రాజకుమారి శాంతిశ్రీని పెంచింది. ఒకసారి గర్భంపోయి సారసికాదేవికి ప్రాణంమీదకు వచ్చినంత జబ్బు చేసినప్పుడు కుసుమలతాదేవి స్వయంగా పెంచిన పాలదాదికన్న ఎక్కువ ప్రేమతో సవతికి పరిచర్య చేసింది. కుసుమలతాదేవి పరిచర్యే సారసికాదేవి ప్రాణం రక్షించింది.

పట్టపురాణి కుసుమలతాదేవిని కన్న చెల్లెకన్న అధికంగా ప్రేమిస్తుంది. ఆడబిడ్డలయిన వాసిష్టి శాంతిశ్రీదేవి వాసిష్టి హమ్మశ్రీదేవులు పెద్దవదిన గారంటే భక్తిగా, ప్రేమగా ఉంటారు. చిన్నవదినగారంటే ఆపేక్ష, స్నేహమూ, ప్రేమా మూడూ రంగరిస్తారు.

అడివి బాపిరాజు రచనలు - 6

175

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)