పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“జగత్కళ్యాణమే మేము కోరుతున్నాము. దీనిలో కొంత నష్టమున్న మాట నిజం. అంతా భగవంతుని ఇచ్చచొప్పునే జరుగుతుంది.”

“ఇక్ష్వాకులబలం మహోన్నతము వారు ఎవ్వరికీ భయపడరు. అయినా ధర్మానికి కట్టుబడి ఉన్నారు వారు.”

“అది ధర్మంకాదు. వట్టి నీరసత్వం! నీరసుడయిన సార్వభౌముని సింహాసనం ఎక్కించడంకన్న నీచధర్మం ఏముందీ?”

"యజ్ఞశ్రీ శాతకర్ణి కుమారుడు సింహాసనం ఎక్కడం తప్పా మహారాజా!"

“తప్పుగనుకనే మేము సార్వభౌమ సింహాసనం అధిష్టించాము విజయశాతకర్ణిని ఏమని సింహాసనం ఎక్కించినాడు శాంతిమూలమహారాజు? నీరసుని సింహాసనం ఎక్కించి తామే రాజ్యంచేయాలనీ, వీలయితే సార్వభౌముని తుదముట్టించి తామే చక్రవర్తి కావచ్చునని కాదూ?”

బ్రహ్మదత్తుడు చాలా బాధపడినాడు. ఎంత విషం ఉన్నది పులమావిలో! బ్రహ్మదత్తుని మోమున పరిహాసరేఖలు ప్రసరించినవి. “పులమావి మహారాజా! ఇక్ష్వాకులు మిమ్ము చక్రవర్తిగా ఒప్పుకొనరు. మీరు విజయ శాతకర్ణి సార్వభౌమునిపైకి ఎత్తి వెళ్ళకుండా ఇక్కడే ఎదుర్కొన్నారు. శ్రీశాంతిమూల మహారాజు వీరవిక్రమమూర్తి యుద్ధంలో నేడు ఆయనను ఎదుర్కొనే మేటి భారతవర్షంలో ఎవ్వరూలేరు. కాని వారు ఉత్తమ ధర్మమూర్తులు. జననష్టానికి వారు ఎంతో బాధపడతారు. కాబట్టి చక్రవర్తిత్వం పరిత్యాగం చేసి మీరాష్ట్రానికి మీరు వెళ్ళిపొండి.”

“ఏమిటీ!”

“మీరు కోపపడకండి. అహింస లోకంలో పరమధర్మము. ప్రతి మానవుడూ పరబ్రహ్మే! ఎవరి మోక్షము వారు పొందే అవకాశము ఎవ్వరూ అడ్డు పెట్టడానికి వీలులేదు. ఏమనుష్యుడూ ధర్మచ్యుతుడు కాకూడదు. ఒక మనుష్యుడు ధర్మచ్యుతుడు అవుతోంటే అలా కాకుండాచూసే ధర్మం పక్కనున్న మనుష్యులందరిపైనా ఉన్నది. ప్రభూ! నామాట వినండి. వెనక్కు వెళ్ళండి. లేకపోతే సముద్రతరంగం ఒడ్డున విరిగినట్టు మీ అదృష్టం ఈ పొలికలనులో విరిగిపోతుంది!”

బ్రహ్మదత్తునిమాట వినగానే పులమావి మండిపోయాడు. “బ్రహ్మదత్తప్రభూ! తమ్ము బందీచేసి ధర్మాన్ని ఇంకా నాశనం చేస్తున్నాను. ఏమవుతుందో చూడండి!” అంటూ “ఎవరక్కడ?” అని కేక వేసినాడు. “చిత్తం!” అంగరక్షక సేనాపతి అక్కడకు వచ్చినాడు. “బ్రహ్మదత్త ప్రభువును బందీ చేసినాము; వారికి విడిది ఏర్పాటుచేయమని నా ఆజ్ఞ సేనాపతికి చెప్పు.” ఇదంతా జ్ఞాపకం వచ్చింది, ధాన్యకటకనగరంలో బ్రహ్మదత్తుడు తన విలాసమందిరంలో ఒంటగా కూర్చుండి ఆలోచించుకొంటూ ఉన్న సమయంలో.

శాంతిశ్రీ ఎంత విచిత్రంగా సంచరించింది. ఆమె కీశక్తిరూపం ఎలా వచ్చింది! ఇందుకు కారణం గురుభక్తి మాత్రంకాదు. తనపై ఆమెకు పరమాద్భుతంగా ప్రేమ మొలకెత్తింది. ఆ రహస్యం ఆమెకే ఇంకా తెలియలేదు.

అడివి బాపిరాజు రచనలు - 6

163

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)