పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆకాశానికి అంటే పాలరాతికొండలు పగిలి అమృతసరస్సు వారలు కట్టి ప్రవహింపసాగింది. అందమై శుష్కమైన జీమూతాలు చల్లబడి మహావర్షం కురియ నారంభించింది. శాంతిశ్రీ హృదయాన్ని దివ్యదీపమై వెలిగించింది ఏదో పవిత్రానుభూతి. శాంతిమూల మహారాజు దీక్ష తీగెలు సాగింది. ఫలసిద్దినందబోతున్నది. తన తపస్సు సిద్ధినందే శుభముహూర్తము ఏతెంచినది. శాతవాహన సామ్రాజ్య సూర్యుడు అస్తమించే భయంకర మూహూర్తము, స్కందవిశాఖుని హృదయసామ్రాజ్యంలో పూర్ణచంద్రులు ఉదయించే దివ్యమూహూర్త మాసన్న మవుతున్నదా?

ఆయన మోమున వెలుగునీడలు తారాడసాగినవి. ఆ ప్రభువు హృదయం ప్రేమతో నిండిపోయినదని ఆయనకే వ్యక్తమయింది. అమృత ప్రవాహం హృదయాన నిండడం ప్రారంభించింది. చిరువాకలు కట్టింది. పరవళ్ళెత్తుతున్నది. శాంతిశ్రీ తన పురుషార్ధసిద్ధి. ఆ బాలిక జగదేక సుందరి. పరమాద్భుత చరిత్ర! ఆమె గడ్డకట్టిపోయిన అమృతము. నేడు తన అదృష్టంకొలదీ అమృతం తరిగి వరదలై వచ్చింది. కృష్ణవేణ్ణలా పొంగివచ్చింది. ఆకాశంలో వెన్నెలే వర్షాలు కురిసింది.

“నీవు బధిరవాదేవి? ఈ నిర్మల ప్ర
 శాంత వాసంతయామినీ సమయమందు
 గాఢరాగరాగాలాప కంఠుడైన
 నన్ను వినవు ? గాంధర్వప్రసన్నుడగుచు
 కరిగి, చిరినరాల పులకరాల తేలు
 అమృతకిరణుండు, పారవశ్యానకలగి
 లాస్యయుతలైరి ఆశాశుభాస్యలు - చెలి!
 ఏల కరుగదు నీయెద? ఇంచుకంత
 కరగ దెచ్చటిదీ నిర్వికార జడత?
 “ఏనాడు తపసు సలిపానో
                   నాదేవి
 ఈనాడు నను చేరినావె!
         ఇది ఒక్క స్వప్నమో
         మదికోరు మోక్షమో
                 సర్వసిద్ధులు కూడి
                 సారూప్యమైతోచే
                         ఏనాడు....
                 సౌందర్య శిఖరితము
                 సఖియ నీ సుమమూర్తి
                           ఆనందమున కవధి
                           అతివ నీ మధుమూర్తి
                                     ఏనాడు....

అడివి బాపిరాజు రచనలు - 6

164

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)