పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“అదేమిటమ్మా! భయానికి కారణమేముంది?”

“అన్నయ్యగారూ! యజ్ఞశ్రీ శాతకర్ణి చక్రవర్తి నిర్యాణమందినప్పటినుంచీ దేశంలో శాంతి ఉందా? రాచరికం ఉందా?”

“రాక్షసుల పరిపాలనమంటావా ఇది!” అన్నాడు శాంతిమూలుడు.

“నీరసుడయిన పురుషుడు, రాక్షసునికన్న హీనం. రాక్షసుడు రాజ్యం చేస్తే రాజ్యం ఉంటుంది, ధర్మం ఉండకపోవచ్చుగాక. నీరసుడు రాజ్యం చేస్తే అరాజకమే, ప్రజా నాశనమేకాదా ప్రభూ?”

“అరాజకాన్ని మనం రానిస్తామా పూంగీయరాణీ” శాంతిమూలుని మాట గంభీరత తాల్చింది

“చక్రవర్తి ధర్మ మేమవుతుంది?”

శాంతిమూలుడు క్షణం మౌనం తాల్చి “చక్రవర్తి సేవకులు సామంతులు అందరిదీ అధర్మం” అంటున్న శాంతిమూలుని మోమున మందహాసోషస్సులు నర్తించినాయి.

(3)

బ్రహ్మదత్తుడనుకొన్నాడు: రాజకుమారి అంత శక్తిస్వరూపిణి అయినదేమి? ఎక్కడనుంచి వచ్చిందీమెకు ఈ విచిత్ర సాహసము? జన్మచే యోగినియు, జడీభూతయు అయిన ఈ పడుచు ఇలా రౌద్రమూర్తియై పులమావి మీద విరుచుకుపడి ఇక్ష్వాకు విజయానికి మూలకారణ మయింది. దీనికంతకూ తానే నిజమైన హేతువనుకున్నాడు. ధర్మమార్గాన్ని ఎరుగనివారు ఆరుదుగా ఉంటారు. మానవ జీవితం తమస్సునుండి వెలుతురుకు హింసనుండి అహింసకు వెళ్ళడానికి సర్వకాలాల ప్రయత్నంచేస్తూ ఉండాలి. ఏమరుపాటుతనం తామసిక పథాలకు తిరిగి నెట్టి వేస్తుంది. మనుష్యుని ఉత్తమసిద్ది కోసము తామసిక పదముపనికిరాదు.

పులమావి ఏలాటి చక్రవర్తి? సార్వభౌమత్వం భూపతులను ఓడించి సామంతులుగా చేసుకోవడంలేదు. ఎవడయితే ధర్మం నాలుగు పాదాలా నడిపించగలదో వాడే చక్రవర్తి. దేహబలాన్నే నమ్మినవాడు భూపతికాడు, వాడు రాక్షసుడు. ప్రభువు సగం దేవుడు. పులమావి ధర్మం మూడుపాదాలయినా నడిపించగలిగిన రాజుకు విష్ణుత్వం వస్తుంది. పులమావి అయినది మొదలు చక్రవర్తి ధర్మాన్ని ఒక్క పాదమయినా నడపదలచుకోలేదు.

బ్రహ్మదత్తుడు చూస్తూ చూస్తూ ఏలా ధర్మచ్యుతి కానివ్వగలడు? రాయబారిగా వెళ్ళి పులమావి హృదయం మార్చి వెనుకకు మరలించాలని నిర్ణయించుకొన్నాడు. వలదని సేనానాయకులు పెక్కుమంది చెప్పినా బ్రహ్మదత్తుడు చిరునవ్వునవ్వి ఊరుకొన్నాడు. శుభముహూర్తము చూచి పులమావి శిబిరానికి బ్రహ్మదత్తుడు బయలుదేరినాడు. పులమావి ఆ ధనక ప్రభవుని గౌరవంగా ఎదుర్కొన తన మంత్రుల పంపి, లోనికిరా, ఆసనం చూపి, కుశలప్రశ్నచేసి 'వచ్చిన పని ఏమి' అని పృచ్చ చేసినాడు. -

“మహారాజా! తాము శాతవాహనులయ్యూ చక్రవర్తిమీదకు దండెత్తి రావడం అనుచితము. కఱ్ఱకొట్టటానికి ఉపయోగించే గొడ్డలిని రాజ్యనాశనానికి ఉపయోగిస్తారా? ఇందరు యుకులు, వీరులు, మీ కాంక్షలకు ఆహుతై పోవలసిందేనా?”

అడివి బాపిరాజు రచనలు - 6

162

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)