పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎందుకు తనకీ ఆవేదన? తాను ధనకరాజ్యంలో ధర్మం నాలుగు పాదాల నడిచేటట్లు చూస్తున్నాడు. ఇక్ష్వాకురాజ్యంలో బందిపోటులు లేవు. పంటలు పండుతున్నాయి. ధర్మం నాలుగు పాదాలా నడుస్తున్నది. తక్కిన సామంత దేశాలు సుభిక్షంగానే ఉన్నాయి. అయినా దేశంలో ఏదో అశాంతి, ఏదో ఆవేదన నిండిపోయింది. వేడిగాలులతో నిండి ఊపిరాడని వేసవికాలంలా ఉన్నది.

బ్రహ్మదత్తుడు ఉదయం లేస్తాడు. స్నానాదికాలు నిర్వహించి, సంధ్యావందనం అర్పించి, అగ్నిహోత్రార్చన నెరవేర్చి, స్కందజపమాచరించి, రాజ భవనంలోనికి వచ్చి ఒక ముహూర్తకాలం రాచకార్యాలు నిర్వహించుకొని సభనుండి లేస్తాడు. వెంటనే ఉత్తమాజానేయ మధివసించి అనుచరుల గూడి నగరసంచారం చేసి రెండుయామాలు పూర్తి కాకమునుపే కోటలోనికి వేంచేస్తాడు. మరల స్నానాదికాలు నిర్వహించి మధ్యాహ్నిక సంధ్యావందనం చేసి మహాఋషులు, పండితులు, చుట్టాలు, భిక్కులు తన పంక్తిని భుజింపగా భోజనం నిర్వహించి అందరి సెలవు అందుకొని, తాను రెండు విఘడియలు విశ్రమిస్తాడు. ఆ రెండు విఘడియలు భగవంతుని ధ్యానము చేస్తూ ఉంటాడు.

అక్కడనుండి ఆ ప్రభువు పండితులతో, ఋషులతో, భిక్కులతో విద్యావ్యాసంగము చేస్తారు. కవులు తమ రచనలను వినిపిస్తారు. ఈ పండిత గోష్టి అర్థయామము జరుగుతుంది. బ్రహ్మదత్త ప్రభువు తనకు తోచిన పారితోషికాలు పండితులు మొదలయిన వారి కర్పించి సభ చాలిస్తాడు.

అచటనుండి మరల రాజసభ జరుగుతుంది. తన కడకు వచ్చిన అన్ని నేర నివారణలు ఆయన పండితుల సహాయంతో సలిపి, తీర్పులు చెప్పి అక్కడ నుండి అనేక రాజవ్యవహారాలు సమాలోచిస్తాడు. లేకపోతే మహారాజు శాంతమూలుని కోటకు వెడతాడు. మహారాజు అపుడు మంత్రి దండనాయకులతో కలసి మంత్రాలోచన సభ జరుపుతాడు.

ఎక్కడెక్కడ పంటలు పండలేదో, ఎక్కడెక్కడ ప్రజలకు సహాయము కావలసి యున్నదో చర్చించి, ఈ విధముగా చేయవలెనని నిర్ణయించి, తాను లోనికి వెళ్ళిపోతాడు. బ్రహ్మదత్తప్రభువు మరల సంధ్యావందనము చేయును. జపతపాలు అయిన వెనుక ప్రభువు నూత్న విషయాలు శాస్త్రాలు చదువుకుంటాడు. భోజనాలవుతాయి. కొంతకాలానికి ప్రభువు తన శయన మందిరానికి వెళ్ళిపోవును.

దేశం అంతా సుభిక్షమే ఉన్నప్పుడు, దేశంలో ధర్మం ఆనంద నాట్యం చేస్తున్నప్పుడు, రాజులు నూతనాలయాలు, చైత్యాలు, గుహలు, నూత్న రాజపథాలు, సత్రములు, వైద్యశాలలు నిర్మిస్తారు. ఇప్పుడు ఆంధ్ర మహాసామ్రాజ్యములో యజ్ఞశ్రీ తన పూర్వీకులనాటి ధర్మం నిర్వహిస్తున్నాడు.

ఆడవిబ్రహ్మదత్తప్రభువునకు నిద్రపట్టదు. ఆయన ఆలోచిస్తూ తన శయన మందిర ప్రాంగణానకు వచ్చి, అచ్చటనుండి మెట్లమీదుగా పూలతోటలోనికి దిగి, ఆ తోటలో ఇటునటు నడయాడుతూ, గాథలు పాడుకుంటూ, రామాయణాది మహాకావ్యాలనుండి శ్లోకాలు చదువుకుంటూ ఏదియో ఆలోచిస్తూ చివరకు రెండుయామాలయిన వెనుక భగవంతుని ప్రార్థించి శయన తల్పం చేరుతాడు.

అడివి బాపిరాజు రచనలు - 6

9

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల