పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

విజయపురం ఒక మహానగరం. ఈ నగరం చుట్టూ ఎత్తయిన కొండలున్నాయి. కొండల పైకి ఒక్కటేదారి ఉంది. ఈ మహానగరానికి తూర్పుగా ఉన్న కొండలలో ఒకచోట కొంత ఎత్తు తక్కువ ప్రదేశం ఉంది. అక్కడికి ఒక రాజపథం నిర్మించారు. అక్కడే ఒక పెద్దకోట గోడ, నాలుగు పెద్ద బురుజులు ఉన్నాయి. తక్కిన కొండల పైన అక్కడక్కడ బురుజులు మాత్రం ఉన్నాయి. ఈ మహానగరానికి కృష్ణవైపున రెండు లోయలున్నాయి. నగరంలో నూరు మహాకూపాలున్నవి. అమృతంవంటి నీటితో నిండి ఉంటాయి ఆ నూతులు.

కృష్ణ ఒడ్డువరకు రెండు లోయలలోను నగరం ఉన్నది. నగరం మధ్యనుంచి రెండు పెద్దరాజవీధులు కృష్ణ ఒడ్డునకు వెడతాయి. నగరం చుట్టి ఉన్న ఉత్తుంగగిరులపైన పడిన వాన నగరం మధ్యకు ప్రవహించి, రెండు వాగులై వస్తుంది. రెండు వాగులు రెండు లోయలగుండా పోయి కృష్ణలో కలుస్తాయి. వాన వచ్చినప్పుడు తప్ప ఈ వాగులలో నీరుండదు. ఈ రెండు వాగులకు నగరానికి దక్షిణంగా ఒక పెద్ద చెరువు నిర్మించారు నగర ప్రభువులు. ఆ చెరువునుండి అనేకమైన కాలువలు భూమిలో నిర్మించినారు. నగరమంతట ఉన్న తోటలకు, కేళాకూళులకు, క్రీడావనాలకు, సంఘారామాలకు ఆ కాలువలగుండా నీరు వస్తుంది. ఈ కాలువల నిర్మాణం వాస్తు శాస్త్రజ్ఞులు అద్భుతంగా నిర్వహించారు. భూమిలో లోతుగా కాల్వలు త్రవ్వినారు. ఆ కాలువలలో గట్టిరాళ్ళు దిమిస చేసిరి. ఆ రాళ్ళపైన చిన్నకాలువగా గాంధారించిన గట్టిరాళ్ళను వరుసగా పేర్చిరి. ఆ రాళ్ళపైన గాంధారించిన రాళ్ళను బోర్లింపగా, వాని మధ్య నలుపలకల గొట్టము ఏర్పడినది. ఆ పైన రాళ్ళతో నింపి కాలువ పూడ్చి సాధారణ భూమిని చేతురు.

విజయపుర మనగా ఆరామనగరమని ఆ కాలంలో పేరు మ్రోగిపోయింది. ఆ మహానగరంలో ఫలవృక్షముల తోటలు, తోటల మధ్య భవనములు ఉన్నవి. రాజవీధుల కీవలావల మనుష్యపథములు, వానికి పక్కగా ఫలపుష్ప వృక్షములున్నవి. నీలవర్ణములైన పర్వతాలపైనుండి క్రిందికి చూచినచో నగరమంతయు దివ్యవనవాటికవలే దర్శనమిచ్చును. దేవతలుకూడ ఆకాశ సంచారముమాని ఈ దివ్యనగరము చూడవత్తురట.

విజయపుర మహాచైత్యం జగత్ర్పసిద్ధము. కాబట్టే దేశదేశాల నుండి బౌద్ధభిక్షువులు విజయపురమునకు వచ్చి అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకొన్నారు. ధాన్యకటక మహాచైత్యంలోవలె విజయపురమహాచైత్యంలోనూ తధాగతుని దివ్యధాతువు నిక్షిప్త మైనదట. విజయపురంలో ఎన్ని సంప్రదాయాలవారో సంఘారామాల నిర్మించుకొని ఉన్నారు. కాబట్టే జంబూద్వీపం అన్ని మూలలనుండి బౌద్ధభిక్షువులు ధాన్యకటకంతోపాటు విజయపురం కూడా దర్శించిపోతూ ఉంటారు.

అడివి బాపిరాజు రచనలు - 6

10

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)