పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శిబిరం వదిలి రావటం లేదు. ఇంత దురదృష్ట సన్నివేశం ఏలా జరిగింది? ఏలా వచ్చింది తనకీ ప్రమత్తత? స్త్రీ అని ఆ బాలికను లోనికి రానివ్వలేదు; ఆమె తన శిబిరంలో బయలుదేరినప్పటినుంచీ పులమావికి గూఢచారులు ఎప్పటి వార్త అప్పటికే తెస్తూ ఉండిరి. ఆ బాలిక శాంతిశ్రీ! శాంతిశ్రీ జగదేకసుందరి, త్రిభువలనైకమోహిని, ఆ దివ్యసుందరమూర్తి శాంతమూర్తి. ఆమెకు లోకజ్ఞానంలేదు. ఆమె తనంతట తాను కోరి తన స్కంధావారానికి వస్తూఉంటే వంట యింటి కుందేలవుతున్నదని మురిసిపోయినాడు. ఆమె ఇష్టపడినా పడకపోయినా వివాహం జరగవలసిందే! ఇంతట్లో శాంతిశ్రీయే వచ్చివాలింది. ఆమెనూ ఆమె వెంటవచ్చే స్త్రీ పరిచారికామండలినీ స్కంధావార గోపురంలో నుండి రానియ్యవలసిందని స్కంధావారమహాపాలకునకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఆ కారణంచేత శాంతిశ్రీ నిరభ్యంతరంగా లోనికి రాగలిగింది. -

వీరపురుషదత్తుడు తన చెల్లెలిదళాలకు గోరుతదూరం వెనుకగా ఉన్నాడు. ఎప్పుడు తన చెల్లెలు లోనికి పోగలిగిందో, ఇందులో ఏదో అనుమానించవలసిన విషయం ఉందనుకొన్నాడు. వెంటనే తన సైన్యాన్ని రెండు పాయలుచేసి స్కంధావారం చుట్టుముట్టాలనీ, ఘనరూపమయిన దళాలుగా ఒక ఘటిలో స్కంధావారాన్ని తాకవలసిందని ఆజ్ఞ ఇచ్చాడు. కొందరు చారులకు ఇక్ష్వాకు సైన్యాలను మహావేగంతోవచ్చి స్కంధావార గోపుర ద్వారానికి ఇరువైపులా తాకి తనవెనుక బలంచేయవలసిందని వార్త పంపినాడు.

శాంతిశ్రీ రాజకుమారి పులమావిని బంధించిందని విన్ననూ పులమావి సేనాపతులు నమ్మలేదు. కాని వీరపురుషదత్తుని సైన్యాలు మహావేగంతో తమ స్కంధావారం లోనికి చొచ్చుకు వచ్చినాయని తెలియగానే కింకర్తవ్యతామూఢులై పదిక్షణికాలు సందేహించారు. ఇంతలో వేగులు ఇక్ష్వాకులసైన్యం వచ్చి తమ స్కంధావారం చీల్చి లోనప్రవేశించిందని తెలుపగానే యుద్ధం విష్ఫలమనీ వృధా సైనికనష్టం లెక్కకు మించిపోతుందనీ నిశ్చయానికివచ్చి యుద్ధం చేయవద్దు అని తమసైన్యాలకు ఆజ్ఞలు వేగంగా పంపించినారు.

బ్రహ్మదత్తప్రభువును ఒక ఆభీరసేనాపతి దర్శించి, “ప్రభూ! మీరిక మా బందీకారు. రాయబారిగా వచ్చిన వారిని బంధించకూడదని మేమెంత మనవి చేసినా సార్వభౌముడు....”

“సార్వభౌములా!” అని బ్రహ్మదత్తప్రభువు ఆశ్చర్యంతో ప్రశ్నించినాడు.

“శ్రీ పులమావి సార్వభౌములు ప్రభూ !” అని సేనాపతి బ్రహ్మదత్తునికి నమస్కరిస్తూ మనవి చేసినాడు.

“ఓహో! అవును ఏమి జరిగినదిప్పుడు?” అని బ్రహ్మదత్తుడు చిరునవ్వుతో ప్రశ్నించినాడు.

“ఏమి ఉన్నది మహారాజా! ఇక్షాకు శాంతిశ్రీ రాకుమారి తన స్త్రీ సైన్యంతో వచ్చి చక్రవర్తి శిబిరం ముట్టడించింది. ఇంతలో వీరపురుషదత్త యువరాజుగారూ, తక్కినయావత్తు ఇక్ష్వాకు సైన్యమూ వచ్చి మమ్ము కత్తి ఎత్తకుండా చేసినారు.”

“అలాగా!”

“చిత్తం.”

అడివి బాపిరాజు రచనలు - 6

157

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)