పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధివసించింది. పులమావివైపూ సేనాపతుల వైపు తీక్ష్ణంగా చూస్తూ “మాలో ఏఒక్కరికి గాయమైనా పులమావితల ఎగిరిపోతుంది. మాగురువు శ్రీశ్రీ బ్రహ్మదత్తప్రభువును మాకు అప్పగించండి. ఆ వెనుక నువ్వు శ్రీశాతవాహనచక్రవర్తికి నీయావత్తు ధనమూ అర్పించాలి. ప్రయాణానికి తగిన ధనంమాత్రం మేము ఇస్తాము. నీ సైన్యంతో వెంటనే బయలుదేరి నీదేశం పో!” అని సూర్యమండల మధ్యస్థ కాంతి పుంజమువలె ప్రకాశించి పోయినది.

అప్పుడా పరమాద్భుత దివ్యసుందరిని చూచి “ఈ బాలిక నాశించికాదా తానీ జైత్రయాత్ర ప్రారంభించింది” అని అనుకున్నాడు పులమావి. ఆతనికి భయమునకు బదులు నవ్వు వచ్చినది. ఈ బాల ఏమిచేయగలదు? తానీ బాలికను ముసికనగరానికి కొనిపోయి ప్రియురాలిని చేసుకొన్ననాడు తన జన్మ ధన్యమగునని పులమావి ఉప్పొంగినాడు. ఈమెకు కోపం వెన్నెలకు తావి అబ్బినట్లు విలసిల్లుతున్నది అని కన్నులరమూతలు వేసుకొన్నాడు.

ఇంతలో స్కంధావారమంతా ఒక్కసారి హోరుమని అలజడి బయలుదేరింది. అప్పుడు శాంతిశ్రీకుమారి అంగరక్షకురాలయిన తారానిక లోనికివచ్చి,

“జయము! జయము! భర్తృదారికా. యువరాజు వీరపురుషదత్తుల వారు లేళ్ళగుంపులో ప్రవేశించి సింహంలా సైన్యంతో ఈ పులమావి స్కంధావారంపైకి ఉరికినారు. స్కంధావారం అంతా చెల్లాచెదరై పోతున్నది. వేరొక దెసనుండి బ్రహ్మదత్తప్రభువు సైన్యాలు తలపడినవి. ఏమి ఆజ్ఞ?”

“ఆజ్ఞ ఏమి ఉన్నది? మన సైన్యాలను వెంటనే మనరథాలను యుద్ధ సన్నద్ధంచేసి, శంఖాలు ఊది, కేకలువేసి 'పులమావి బందీ అయ్యాడు. మీరు యుద్ధం ఆపండి. లేకపోతే పులమావి మృత్యువు తథ్యము' అని చాటించు!” అని శాంతిశ్రీ కత్తి తళతళవలె మాట్లాడింది.

11

ఒక అరఘడియలో యుద్ధం ముగిసిపోయింది. బ్రహ్మదత్తుని పట్టినానని గర్వపడిన పులమావి తానే పట్టుబడిపోయినాడు. ఏ భటుడూ యుద్ధం చేయడానికి సాహసించలేదు. ఏ సేనాపతీ యుద్ధం సాగించండి అని ఆజ్ఞ ఇవ్వడానికి సాహసించలేదు. పులమావి సేనలో. అంతపెద్ద ఎత్తూ ఇంత సులభంగా ఈడ్చుకుపోయింది! ఏది ఎట్లా అయిందో ఎవరికీ స్పష్టంకాలేదు. ఒక్కబిందువైనా రక్తం ఎందుకు ప్రవహించలేదో ఎవరికీ అర్థం కాలేదు.

ఈ మాయంతా రాజకుమారి శాంతిశ్రీదన్నారు. శాంతిశ్రీ ప్రళయ యుద్ధం చేసిందన్నారు. యువరాజు వీరపురషదత్త ప్రభువుని యుద్ధచమత్కృతిలోని మహత్తిది అని అనేకులు నొక్కి చెప్పినారు. కొందరు అన్నా చెల్లెలూ ఈ విచిత్రవిధానము అల్లినారని అనుకొన్నారు. మరికొందరు బ్రహ్మదత్తప్రభువే ఈ ఎత్తంతా ఊహించింది. తన ఎత్తు ప్రకారం తాను ముందు పట్టుబడి తర్వాత ఈ విధమైన నాటకం అంతా ఆడించాడని ఆనందంతో నవ్వుకొన్నారు.

పులమావి ధనం అంతా పట్టుబడింది. సైనికుల ఆయుధాలన్నీ సంగ్రహించినాడు వీరపురుషదత్తుడు. పులమావి పొడిగుడ్లుపడి వంచినతల ఎత్తకుండా తన్నుబంధించిన

అడివి బాపిరాజు రచనలు - 6

156

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)