పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“సరే మనం వెళ్ళి శాంతిశ్రీ రాకుమారినీ, వీరపురుషదత్త ప్రభువునూ దర్శించగలంలెండి” అని చిరునవ్వుతో ప్రభువు లేచినాడు. మౌనమూర్తియై రెప్పవాల్పక శాంతిశ్రీ రాకుమారి పులమావివైపు తీక్షంగాచూస్తూ సింహాసనం అధివసించి ఉన్నది. పులమావి ఆమెవైపు రెప్పఎత్తి చూడలేక పోయినాడు. అతనికిలోన నిర్వచింపరాని భయం ఆవేశించింది. ఏమిటీ బాలిక? ఆమె పిచ్చిదా? పిచ్చివారు ఏమి చేసినా చేస్తారు అనుకున్నాడు పులమావి.

ఆమె దివ్యసౌందర్యం ఆ భయంకరమూర్తిమత్వంవల్ల ప్రళయతాండవోద్యోగియగు రుద్రుని తాళగతిలా ఉన్నది. ఎవ్వరినోటను మాటలేదు. అక్కడ ఉన్న రక్షకయువతులు మ్రాన్పడి నిలిచి ఉన్నారు. అందరికీ ఏదో భయం ఆవహించింది. తొందరగా ఇంతలో వీరపురుషదత్త ప్రభువులోన ప్రవేశించి “చెల్లీ !” అని పిలచి అర్థాంతంలో ఆగిపోయినాడు. ఆ యువకునకు ఒక్కసారి మంచుగడ్డలమధ్య పడినట్లు హృదయము జిమ్ముమన్నది. అతడు తెల్లబోయి అల్లానే నిలుచుండిపోయినాడు. మరుసటి నిమేషంలో బ్రహ్మదత్త ప్రభువు నెమ్మదిగా ఆ గుడారములోనికి ప్రవేశించి చిత్రించిన మహాచిత్రంలా ఉన్న ఆ దృశ్యము చూచినాడు. ఆయనకు ఒక నిమేషంలో ఏదో ఒక పరమాద్భుతము ప్రత్యక్షమైనట్లు తోచింది. చిరునవ్వు నవ్వుతూ ఆ ప్రభువు,

“వీరపురుషదత్త మహారాజా ! ఏమిటా అత్యంతాశ్చర్యకరమైన విషయం ? శిష్యురాలా! రాజకుమారీ! ఏమిటి అలా క్రోధఘూర్ణిత అపరాజితాదేవిలా పీఠము అధివసించి ఉన్నావు?” అని ప్రశ్నించినాడు. బ్రహదత్తుని మాటలు చెవిసోకగానే శాంతిశ్రీ నిద్రలేచిన బాలికవలె దీర్ఘమైన నిట్టూర్పు పుచ్చి కన్నులు మూసికొన్నది. “శాంతిశ్రీ! శాంతిదేవీ!” అనే బ్రహ్మదత్తుని పలుకులు సామగానంలా ఉన్నాయి శాంతిశ్రీ కన్నులు అరమూతలుగా తెరిచి "గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః” అంటూ పూర్ణవిస్ఫారితనేత్రాల ఆమె ఇటునటు చూచింది. “తారానికా! ఇదంతా ఏమిటే? ఎక్కడ ఉన్నామే?” అని అడుగుతూ ఇటునటు చూచి, కనుగొని, “గురుదేవా! మీరెక్కడనుండి వచ్చినారు?” అంటూ పీఠం మీదనుంచి లేచి వచ్చి గురుదేవుని పాదాలపై వాలిందా బాలిక.


★ ★ ★

అడివి బాపిరాజు రచనలు - 6

158

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)