పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“గురువుగారూ! ఈ యుద్దాలు మానడానికి వీల్లేదా?” అని శాంతిశ్రీ బ్రహ్మదత్త ప్రభువు రాగానే వారిపాదాలకు వంగి నమస్కరించి ఎంతో ఆందోళనతో ప్రశ్నించింది. ప్రత్యూషారుణకాంతులు ఒకదానివెనుక ఒకటి వచ్చినట్లుగా ఆ బాలికలో నానాటికి ప్రత్యక్షమయ్యే ఏదో విచిత్ర చైతన్యోదయాన్ని పరిశీలిస్తూ అక్కజంపడుతున్నాడు బ్రహ్మదత్తుడు.

“యుద్దాలు మనం కోరి తెచ్చుకుంటామా రాకుమారీ!” అతడు చిరునవ్వు నవ్వాడు.

“అది అల్లా ఉంచండి. పరమార్థం విచారిస్తే యుద్ధాలు అయినా ఒకటే, కాకపోయినా ఒకటే అని మీరు అనవచ్చును. అది స్థితప్రజ్ఞుల విషయం. దుఃఖంలోపడి కుళ్ళిపోయే ప్రజానీకానికి ఈ వేదాంతం చాలా భయంకరం కాదా అండి!” ఆమె మోము అద్భుతమైన కాంతితో నిండిపోయింది.

ఆమెను అత్యంత సమ్మోదంతో గమనిస్తూ బ్రహ్మదత్తుడు, “రాజకుమారీ, నువ్వు చెప్పిన విషయాలు సత్యదూరాలు కావు. అయినా ప్రస్తుతము మన ప్రపంచములో ప్రసరించి ఉన్న యుద్ధనీతి విచిత్రగతుల నడచి వచ్చింది. అది సముద్రానికి చేరబోయే నదివంటిది. దానికి సరియైన దారి కల్పించి సముద్రాన్ని చేర్పించాలి. అంతేకాని వెనక్కు నెట్టాలని బ్రహ్మాండమయిన ఆనకట్ట కట్టాలని ప్రయత్నం చేస్తే దేశం అంతా వరదలు నిండుతుంది. అంటే స్త్రీ పురుషులు ఆబాలవృద్దంగా హింసావశులై తమ్ము తామే నాశనం చేసుకుంటారు. మనలో ఉండే హింసాబుద్ధి కీయుద్దాలు నిదర్శనం.” ఆమె తన గురువును ఎంతో భక్తితో చూస్తూ ఆయన మాటలు విన్నది.

“యుద్దాలు పూర్తిగా మానివేసి సంప్రతింపుల మూలంగా ఎందుకు సామరస్యం కుదుర్చుకోకూడదు ప్రభూ?”

"ఒకడు సామరస్యానికి కూడిరాకపోతే రెండవవాడు ఏమి చెయ్యాలి?”

“అందుకని ఉభయులూ నాశనం కావాలా? మనమే గెలుస్తామని నమ్మకమెట్టా? ఎవరు గెలిచినా నష్టం ఉభయత్ర తప్పదుకదా?”

“దేవతలుకూడా రక్షసులతో యుద్ధాలు చేయలేదా? రాజకుమారీ?”

“రాక్షసులు అంటే మనలోని రాక్షసత్వం కాదా అండి?" మానవునిలోని పశుత్వం నాశనం చేయడం కాదా అండి?”

అడివి బాపిరాజు రచనలు - 6

132

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)