పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దర్శనమిస్తుంది. పూలవనం మధ్యగా రధ్య ఉన్నది. పూలవనం దాటగానే అతిథిమందిరాలు రధ్య కీవలావల దూరంగా ఉన్నవి. అవి దాటి వెళ్ళగానే ఫలోద్యానమున్నది. అందు దేశదేశాల వెలయు ఫలవృక్షాలు మాలీలు పెంచుతూ ఉంటారు. ఫలవనం దాటగానే ఒక అందమైన సరోవరము ప్రత్యక్షమవుతుంది. ఆ సరోవరంలో పద్మాలు విలసిల్లుతూ ఉంటాయి. అందు రాజహంసలు సంగీతంలో తేలియాడే తాళాలులా ఈదుతూ ఉంటాయి. రధ్య రెండుపాయలై గుండ్రని ఆ సరోవరానికి ఈవలావలగా పోతుంది. సరోవరానికి ఆవలప్రక్క తెల్లనిపాలరాతితో నిర్మించిన దివ్యమందిర మాలిక ప్రత్యక్షమవుతుంది. ఈ మందిరాలు స్కందవిశాఖాయనక ప్రభువే నిర్మించినాడు. ఈ విచిత్రాలన్నీ చూస్తూ శాంతిశ్రీ మందిరాలవరకూ పోయి అక్కడ రథావరోహణం చేసింది.

రాజకుమారి వస్తున్నదని అంగరక్షకులు చూచి వెంటనే రాజమందిరంలోనికి వార్త అందిచ్చినారు. రాజకుమార్తె కోటకు వెనకవైపున నున్న గోపుర ద్వారంలోనుంచి వచ్చింది. ముఖద్వారం తూర్పుదెస ఉన్నది. రాజకుమారి వచ్చిన ద్వారము పడమటి గోపురము. శాంతిశ్రీ చెలికత్తెలతో రథం దిగగానే బ్రహ్మదత్తప్రభువు తల్లి నాగసిరిదేవి ఎదురువచ్చి శాంతిశ్రీని కౌగలించుకొని, దాసీలు దృష్టితీసే ఎఱ్ఱనీళ్ళు పట్టుకొనిరాగా, తానే స్వయంగా దృష్టితీసివేసి లోనికి నడిపించుకొనిపోయి, తన అంతస్సభా మందిరంలోనికి ప్రవేశపెట్టి ఆమెను బంగారు అసనంపై అధివసింప చేసినది.

"తల్లీ! మీరు మా కోటకు రావడం నా కెంత ఆనందమో నేను చెప్పలేనమ్మా!” అని నాగసిరిదేవి తన ఆనందం వెలిబుచ్చుతూ పలికింది. “మా గురువుగారు పులమావి జైత్రయాత్రను అరికట్టడానికి వెడుతున్నారు. ఆ సంగతి వారితో మాట్లాడాలని వచ్చాను మహారాణీ!” శాంతిశ్రీ ఏదో ఆలోచనాధీనయై ప్రత్యుత్తరమిచ్చింది.

“మనం బ్రాహ్మణులమైనా రాజధర్మం పూనినాముకాదా అమ్మా! ఈనాటిదికాదీవృత్తి మనకు ఈ దేశం అంతా అటవీయమై ఉన్నప్పుడు సాంఖ్యాయననులు ధనకదేశాలనికి రాజులై ఉండేవారు. మా అబ్బాయి పూర్వీకులలో ఒక మహారాజు, శ్రీ శాతకర్ణి శాతవాహన చక్రవర్తి ఆజ్ఞ ప్రకారం, ఈ అడవిదేశం అంతా జనపదప్రదేశం చేసి ఇక్కడ రాజ్యం స్థాపించారు. అందుకే ఈ నగరానికి విజయపురం అని పేరు వచ్చిందట రాజకుమారీ!”

“ఎంత రాజధర్మం వహించినా బ్రాహ్మణధర్మము పునాది అయి ఉండాలికదా దేవీ! ” శాంతిశ్రీ ప్రశ్న ఎంతో దైన్యపూర్ణమై ఉంది.

“అవును కుమారీ! నీ భావం నాకు అర్థమైంది. నువ్వు అబ్బాయితో మాట్లాడుతావా? ఇప్పుడే అతనికి వార్త పంపుతాను.” ఆమె వెంటనే పరిచారికతో “మహారాజు తనయ శాంతిశ్రీదేవి ప్రభువుగారితో మాట్లాడుతారు గనుక ఇక్కడికి నేను రమ్మన్నానని చెప్పు” అని ఆజ్ఞ ఇచ్చింది.

నాగసిరిది స్ఫురద్రూపము. శాంతముట్టిపడుతుంది ఆమె తేజమున. ఆమె మాటలు జలజలా ప్రవహించిపోయే శైవాలినీ స్వనాలులా ఉంటాయి, విజయపురంలో ఉన్న మహిళాలోకం అంతా నాగసిరిదేవిని ఎప్పుడూ దర్శిస్తూ ఉంటుంది. ఎవరికి కష్టం వచ్చినావారా తల్లి దగ్గరకు వచ్చి తమ హృదయం ఆమెకడ విప్పుతారు.

అడివి బాపిరాజు రచనలు - 6

131

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)