పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“స్వామీ! తాము అశ్వారూఢులై ఎచ్చటికో పోతూ ఉండిరి. ఇంతలో ఏనుగంత సాలిపురుగొకటి వచ్చి, పెద్దపెద్ద మోకులవంటి తంతులతో మిమ్ము బంధించి వేసిందట!”

“చిత్రము !”

“ఆ వెంటనే ఒక మహాజ్వాల ఎక్కడనుండో ఆవతరించి ఆ తంతులను మండించి వేసిందట! నాకు మెలకువ వచ్చింది.”

“కల శుభాంతమే కదా?”

“అయినా మీకు కష్టము వచ్చునుకదా ప్రథమంలో?”

“అది వ్రాసి ఉంటే తప్పించుకోగలమా?”

“మానవయత్నం విధివ్రాతను తప్పింపలేదా?”

“అయినా నా విషయంలో ఇంత ఆతురత ఎందుకు రాజకుమారీ?”

“మీరు నా దేశికులు.”

“నీకు పూర్వం ఈ ఆతురత ఎవరి విషయంలోనూ ఉండేది కాదు గాదా?”

“నాకు ఏవో విచిత్రానుభూతులు స్వప్న ప్రపంచంలోవలె వస్తూంటాయి.”

“ఇదీ ఒక స్వప్నానుభూతా?”

“నాకేమి తెలియును ప్రభు?”

9

ఆంధ్రదేశానికి చక్రవర్తినంటూ బయలుదేరిన పులమావి మహావేగంగా సైన్యాలతో కొఱవి మహాపథానికి ఉత్తరప్రదేశాలవరకూ వచ్చి అక్కడ దండు విడిసి, సేనాపతులతో ధాన్యకటకమునా ముందు ముట్టడించవలసినది, లేక విజయపురమునా? అన్న విషయం తేల్చడానికి సభ చేసినాడు.

మహాసేనాపతి “అన్నదాతా! విజయపురంవారు బలవంతులు, విజయపురం కైలాసంకన్నా బలమైనకోట. దానిని పట్టాలంటే శతవత్సరాలు పడుతుంది” అని వినయంగా మనవి చేసుకొన్నాడు.

“ధాన్యకటకం ముందు ముట్టడించాలని మీ ఉద్దేశమా మహాసేనాపతీ ?” అని పులమావి పృచ్చ చేసినాడు.

“చిత్తం సార్వభౌమా!”

“కారణం?”

“ఒక కారణం అన్నదాతకు మనవిచేసి ఉన్నాను, రెండవ కారణం ధాన్యకటకం పట్టడం సులభమని నా మనవి.”

“సులభమైనవి పట్టడంలో మన గొప్ప ఏముంది? పైగా బలపూర్ణమైన విజయపురం అలాగే ఉంటుంది. అప్పుడు మాత్రం మనకు ఇక్ష్వాకులను నెగ్గడం కష్టసాధ్యమైన పనికాదా?”

“చిత్తం మహాప్రభూ! కాని ధాన్యకటకం మనం ముట్టడించినప్పుడు ఇక్ష్వాకు బలగాలు అక్కడకు వచ్చి తీరుతాయి. వాటిని అక్కడ సులభంగా జయించవచ్చు.

అడివి బాపిరాజు రచనలు - 6

133

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)