పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అలకనందగా, గంగాదేవి బహుప్రవాహమై ఉద్భవించి ప్రవహించి, ప్రయాగలో తన్ను తాను చేరుకుంటూ సర్వకళా రూపిణియై, యమునగా వచ్చి ప్రపంచంలో సంగమించి ప్రవహించి మహాసాగర మోక్షం పొందుతూ ఉంటుంది. తన పవిత్ర గంగామూర్తి శాంతి శ్రీదేవిలో శృంగారభావం ఏనాటికౌనా ఉద్భవిస్తుందా? నాగార్జునదేవుల మోము ఏదో దివ్యకాంతులతో వెలిగిపోయింది.

“గుణభద్రా! బ్రహ్మదత్తునికి భిక్షుకదీక్ష ఇవ్వలేను. ఆ ఉత్తమ పురుషుడు బౌద్ధధర్మం అర్ష ధర్మంలో లీనం కావించ ఉద్భవించినవాడు. ఆయన నన్ను చూడడానికి ఈ నగరం వస్తాడు. ఆ సమయంలో శాంతిమూలమహా రాజుకూడా నాదగ్గరకు వచ్చుగాక. వారు నన్ను చూచి వెళ్ళిన మర్నాడు, అమ్మాయి శాంతిశ్రీ రాకుమారిని మన ఆశ్రమానికి ఒకసారి తీసుకొని వచ్చి నా ఎదుట ప్రవేశపెట్టు.” ఆ అవతారపురుషుని అస్పష్టమైన గంభీరవచనాలు ఆగిపోయాయి. గుణభ్రదాచార్యులు నెమ్మదిగా తలవంచి ఆ బోధిసత్వునికి నమస్కరించి వెడలిపోయినాడు.

భిక్షుకులు లోకవ్యవహారాలతో ఎందుకు జోక్యము కలుగజేసుకోవాలి? వారు సర్వసంగపరిత్యాగం చేసి, గుణాలను చంపుకొని, అష్టమార్గావలంబకులై నిర్వాణగాములై ముక్తిపొందాలి కదా అని గుణభద్రుడు రెండు మూడు మారులు భగవంతునితో మనవి చేసుకొన్నాడు. వారు చిరునవ్వు నవ్వి ఊరుకొన్నారు.

భగవానుడు బుద్ధత్వం పొందనున్న బోధిసత్వులు కావడంవల్ల వారి భావాలు, చేతలు సాధారణ మానవుల ఊహల కందవు. ఆ తధాగతులకడకు మహారాజ్యాధిపతులు ఆలోచనకై వచ్చేవారు. సామాన్యులుకూడా తమ కష్టసుఖాలు వారికి నివేదించి సందేహనివృత్తి చేసుకొనేవారు. నిర్వాణపథగాములైన వారికి ఈ ప్రపంచ సంబంధం లోహనిగళరూపమే అని గుణభద్రుని మతం. గుణభద్రాచార్యులు విజయపురంలోనికి వెళ్ళేవారు కారు. ఎల్లప్పుడు ఆత్మానాత్మ విచారణ చేసుకుంటూ, బుద్ధదేవుని మూర్తిని ధ్యానిస్తూ ఉండడమే ఆయన దినచర్య. ఆయన పూర్వాశ్రమంలో ప్రతీపాలపుర నగరవాసి. చిన్నతనంలో కృష్ణానదిపాలైన తల్లిదండ్రులు, భార్య మాయమైపోవడంవల్ల సంసారంరోసి, శ్రీ నాగార్జునదేవుని కడకు చేరి కొన్నాళ్ళకు బౌద్ధదీక్ష పుచ్చుకొని, ఆ అవతార పురుషుని ఒక్కక్షణమూ వదలని ఉత్తమ శిష్యుడు.


★ ★ ★

అడివి బాపిరాజు రచనలు - 6

117

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)