పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ బాలిక శుద్ధసత్వమూర్తి అయినా అయి ఉండాలి, లేదా ఏదో మహా విచిత్ర భావమూర్తి అయినా అయి ఉండాలి. తాను మాత్రం ఆమెకు దాసుడు. ఆమె క్రీగంటిచూపుల మెలగవలసిన బానిస. ఈ మహారహస్యం సువర్ణ ద్వీప అమరావతి నగరంలో కలిగింది. శివమహాక్షేత్రమైన ధాన్యకటకామరావతి పేరుపెట్టి నిర్మించిన ఆ మహానగరంలో ఒక స్థూపం ప్రక్క బోధిసత్వుడైన మంజుశ్రీ విగ్రహం చెక్కి ఉంది. ఆ మంజుశ్రీ విగ్రహంప్రక్క నిలుచుండి ఉన్న మూర్తిని బ్రహ్మదత్తుడు చూచినాడు. ఆ దేవీ విగ్రహ సౌందర్యం అనన్యం. యౌవనవతులయందే ప్రేమ. పడుచువాడు ముసలిఅవ్వను ప్రేమించలేదు. అప్పుడు శృంగారావిర్భావము ఏమవుతుంది? ముసలినాయకుడైనా పడుచు నాయికను ప్రేమించవలసిందే. ముసలి అవ్వను ప్రేమించాలంటే ఏ అమ్మగానో, అమ్మమ్మ, తాతమ్మగానో ప్రేమించవలసిందే.

అలాగే పడుచునాయిక ముసలివానిని చూచి ప్రేమిందగలదా? శకుంతల దుష్యంతుని ప్రేమించింది. రత్నావళి ఉదయనుని ప్రేమించింది. కాని వాళ్ళు కౌమార నాయకులు, ఆ కౌమార నాయకుల సౌందర్యం చూచి నవయౌవనవతి అయిన నాయిక ప్రేమించదు. ఆ నాయకునియందు విశిష్ణ లక్షణాలో ఇంకా ఏవో ఉంటే అవి చూచి, విని ప్రేమించవలసిందే. కాని “ఓ సుందరాకార, ఓ జితమన్మథ” అని నవోఢ నలుబది సంవత్సరాల నాయకుని ప్రేమింపలేదు.

ప్రేమ మానవ జీవితంలోని ఒక మహోత్తమ జంతుస్వభావము. ఆకలి దప్పులులా ఈడు వచ్చిన పురుషునికి స్త్రీకి పరస్పరం వాంఛ కలిగి తీరుతుంది. ఆ వాంఛను ఎవ్వరూ ఆపలేరు. మహర్షులైనా ఆ బాధనుండి తప్పుకోలేరు. తన పూర్వీకుడైన గాంధేయ రాజర్షి బ్రహ్మర్షి యగుటకై తపస్సుచేసి చివరకు మేనకకై తన్ను అర్పించుకొన్నాడు. పశుశక్తి అయినా ఈ వాంఛ ఆహార నిద్రా భయాలకంటె ఎన్నో కొన్నిరెట్లు మహోత్తమం కదా? ఆహార నిద్రాభయాలు వ్యక్తిగతమైనవి. స్త్రీగాని, పురుషుడుగాని, జంతువులుగాని, వ్యక్తిగతంగా వృద్ధిపొందేందుకు మాత్రం ఆహారం తీసుకొంటారు. విశ్రాంతికై నిద్రా, స్వరక్షణకై భయం; కాని జాతి వృద్ధికై సంయోగం. ఈ ధర్మమే మానవునిలో ఒక తపస్సయినది. వివాహకర్మ నిర్మించుకొన్నాడు. అది ఒక పవిత్రయాగమైనది. పరవళ్ళెత్తి ప్రవహించే వరదలకు గట్లు నిర్మాణమైనవి. చివరకు తపస్సయినది. పున్నామ నరకభావం ఉద్భవించింది. “ఓహో! ఎంత విచిత్రమైనవారు మహర్పులు!”

బ్రహ్మదత్తప్రభువునకు శృంగారభావం ఆకాశగంగ భూమికి అవతరించినట్లయింది. తనగంగ శాంతిశ్రీదేవి. ఆమెకు ఈ ప్రాపంచిన చైతన్యమేలేదు. హిమవత్పర్వత శృంగముల త్రుళ్ళింతలాడే గంగకుమాత్రం భూమిపై రక్తి చటుక్కున అవతరించిందా? ఆ గంగను శివుడు జటాజూటాలలోనికి ఆహ్వానించాడు. ఎంత అద్భుతభావం? పరమశివుడు వ్యోమకేశుడు. ఆ కేశాలు సగుణరూపమై జటలుకట్టినవి. ఆ జటలలో తేజోరూపిణియైన గంగ జలరూపంగా జేరింది. ఆ జలాలలో మంచుగడ్డలు. ఆ ప్రదేశానికే మనుష్యుడు వెళ్ళలేడు. హిమాలయ శిఖరాలా జటలు. ఆ శిఖరాలలో భాగీరథిగా, మందాకినిగా,

అడివి బాపిరాజు రచనలు - 6

116

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)