పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వీపంలోని కాంభోజదేశంలో కాకులనగరానికి, యువద్వీపంలోని పాండురంగ, అమరావతి, విజయాదినగరాలకూ పోయి సంఘారామా లేర్పరచి, చైత్యాలు నిర్మించి, ధర్మబోధ లోకమంతా వ్యాపింప చేస్తున్నారు.

నాగార్జునదేవుడు తిరిగిరాగానే ప్రజలలో మళ్ళీ భక్తి ప్రపత్తులు పెరిగినవి. చైత్యాలు బాగుచేసినారు. సంఘారామ భవనాలు పెరిగినవి. ఇతర దేశాల భిక్కులు వేలకు వేలు వివిధ సంఘారామాలలో వివిధ సంప్రదాయాల గురించి నేర్చుకొనడానికి రావడానికి ప్రారంభించారు. దేశదేశాలనుండి సాధారణ ప్రజలు యాత్రలుచేస్తూ నాగార్జున పర్వతాశ్రమానికి ఆంధ్రదేశం లోని వివిధ పవిత్ర క్షేత్రాలకూ విరివిగా రాసాగినారు.

నానాటికీ ఈ అవతారపురుషుడు తన ఆశ్రమం వదలిరావడం మానివేశాడు. ఆ దివ్యపురుషుడు రచించిన గ్రంథాలు వేలకువేలు ప్రతులు వ్రాసికొని భిక్కులు వివిధదేశాలకు తరలించుకు పోసాగినారు. ఆయన దర్శనమాత్రాన ప్రజలకు కలిగే పవిత్రానందం ఇంతా అంతా అనికాదు. ఆ మహాభాగుని నామం తెలియని భూభాగం ఈ జంబూద్వీపంలో ఎక్కడాలేదు. సువర్ణయవ కాంభోజ చీనాదేశాలలో ఆ బోధిసత్వుని గురించి అనేక అద్భుతాలైన గాధలు ప్రచారంలోనికి వచ్చాయి. ఈ దినం ఇక్కడుండి మరుక్షణం వేరొకచోట దర్శనమిస్తారని, పక్షిగా మారి ఆకాశ మార్గాన ఎగిరిపోతారని, దర్శనమాత్రాన ఏలాంటి రోగాలైనా కుదిరిపోతాయనీ! ఒక్కొక్కప్పుడు ఆయన దేహం బంగారుమయమై ధగధ్ధగాయ మానంగా వెలిగిపోతుందని అనేక విచిత్రాలుగా చెప్పుకొని, ఆయన పేరు తలచుకొని ఉప్పొంగి పోతూఉంటారు.

4

ఆంధ్రదేశం అంతా సర్వమత వ్యాప్తమై కలకలలాడిపోతూ ఉన్నది. బోధిసత్వ నాగార్జునదేవుని బోధనలు అర్షధర్మపరులైన బ్రాహ్మణ పండితులకూ నచ్చినవి. వారు కూడా తమ దర్శన వ్యాఖ్యానాలయందు నాగార్జున దేవుని వాదనలనేకం చేర్చుకున్నారు.

బ్రహ్మదత్తప్రభువు బోధిసత్వుని తలచుకుంటూ ఆయన బోధలీ సువర్ణ ద్వీపంలో ఎంత అద్భుత ప్రచారంలోకి వచ్చినవా అని ఆశ్చర్యపడుతూ తమ పడవమీద తిరిగి ప్రయాణం చేస్తూ వస్తున్నాడు. ఆ యువక ప్రభువునకు శ్రీ కృష్ణాపదిష్టమైన దివ్యగీత అంతా సంపూర్ణార్థంతో బోధిసత్వ నాగార్జునదేవుని కంఠప్రబోధితమై వినిపించింది. వారి నౌక శాంతవర్తనుడైన ప్రాక్సముద్రవీచీ నృత్యమూర్తియై తేలివస్తున్నది. ఆ నౌక ముందు తట్టుపై కూర్చుండి బ్రహ్మదత్తుడు ఎడతెగని సముద్రవీచికామాలలూ, అంతులేని నీరూ, బ్రహ్మాండచ్ఛత్రమైన ఆకాశము చూస్తూ విజ్ఞానవిశ్వాల ఊహించుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నాడు. పరమసుందరియైన శాంతిశ్రీ రాకుమారి ఆ యువకప్రభువు మనోనయనాల ప్రతిక్షణమూ ప్రత్యక్షమవుతున్నది. అవును; తాను సర్వము తెలుసును అనుకుంటూ గర్వించి చివరకు సంపూర్ణ గర్వభంగం పొందిన విషయం ఈ సముద్ర యానంలో పూర్తిగా గ్రహించాడు.

అడివి బాపిరాజు రచనలు - 6

115

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)