పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బోధిస్తే వెంటనే బౌద్ధధర్మాభిరతులై పోయారు. బుద్ధావతార కాలంనుంచీ సంప్రదాయంగా వచ్చే మార్గాలలో సాంఘికవాదం తీసుకువచ్చినవారు ఆంధ్రులే. సంప్రదాయవాదులగు వీరు స్థవిరవాదులన్నారు. ఆ వాదాన్నే “తెరవాదము” అనికూడా అంటారు.

వైశాలిలో బౌద్ధమహాసంఘ సమావేశం జరిగింది. అలాంటి సమావేశాల్ని “సంగీతి” అంటారు. ఆ సంగీతిలో పెద్దలందరూ సంప్రదాయవాదం గ్రహిస్తే యువజనులు బుద్ధదేవునే భగవంతుడని నమ్మి అవతారభావ మాయనకు కల్పించారు. వీరు ప్రజాహితులు గనుక మహాసాంఘిక వాదమని పిలుచుకొన్నారు. మహాసాంఘిక వాదంలో అనేక చిన్న చిన్నవాదాలు పుట్టుకువచ్చాయి. ఈ వాదాలన్నిటికీ ఆంధ్ర లేక ఆంధ్రవాదాలని పెద్దలు పేరు పెట్టినారు. శ్రీ నాగార్జునదేవుడే బౌద్ధయానానికి శంకరభగవత్పాదులు అద్వైతమునకు వలె దర్శనాలు రచించి శూన్యవాదానికి జనకులయ్యారు. ఇన్ని మార్పులు వస్తూ ఉన్నా ఆ దినాలలో దీక్షలు పుచ్చుకొనడం, దీక్షలు మార్చు కోవడం పెద్ద తప్పుకాదు. తండ్రి బౌద్ధుడు, కుమారుడు శైవుడు, తల్లి జైన ధర్మపరురాలు. కోడలు ఒకవైపు బౌద్ధ చైత్యానికి ఆయక స్తంభం వేయిస్తుంది. వేరొకప్రక్క స్కందపూజ చేయిస్తుంది. మీమాంసలు, జిజ్ఞాసలు, వాదాలు, బౌద్ధాచార్యులకు పండితులకూ, భిక్కులకూ, జైన సన్యాసులకూ మాత్రమే! నమ్మకాలలో తప్ప వివిధ వాదాలవారి సాధారణ జీవితాలలో తేడాలులేవు. జైనుడైనా, బౌద్ధుడైనా ఆంధ్రసంసారివేషం, జీవితమూ ఒక్కటే. ఈవల చైత్యపూజ చేస్తాడు, ఆవల శైవదేవాలయానికి వెడతాడు. మర్నాడు ఇంట్లో బిడ్డకు జబ్బు చేస్తే కొండదేవతకు బలులు పంపుతాడు.

ఆడవి స్కందవిశాఖాయనక బ్రహ్మదత్త ప్రభువు క్షేమంగా వస్తారని శ్రీ నాగార్జున దేవులూ, శ్రీ ధర్మధత్తమహాఋషి సెలవిచ్చినారన్న వార్త పూంగీప్రోలు చేరింది. వెంటనే వాసిష్టీ పూంగీయరాణి శాంతశ్రీదేవి పూంగీప్రోలు దేవత సాగరికాదేవి ఆలయానికి వేయి కొబ్బరికాయలు అర్పించింది. పట్టణ చైత్యాలన్నిటికీ ఒక్కొక్కదానికి వేయిచొప్పున దీపాలర్పించింది. బ్రహ్మదత్తుని జీవితంతో ఇక్ష్వాకువంశ భవిష్యత్తు గాఢసంబంధం కలిగి ఉన్నది అని ఆమెకు పూర్తిగా తెలుసును.

శాంతిశ్రీదేవి చాలా అందకత్తె. రాజనీతిలో మేటి. ఆమె అన్నగారికి కుడిచేయి. ఆమెచెల్లెలు హమ్మశ్రీదేవి చదువుకొన్నది. సంగీత, నాట్య, సాహిత్యాది విద్యలందు ప్రజ్ఞావంతురాలే కాని రాజకీయాలలో ఎప్పుడూ పాలు పుచ్చుకొనేదికాదు. రాజకీయాలు శాంతశ్రీదేవివే! శాంతశ్రీ చాణుక్యదేవుని అర్థశాస్త్రము, శుక్రనీతీ, గౌతమ ధర్మసూత్రాలు, ఆపస్తంభ బౌద్దాయన సూత్రాలు పూర్తిగా చదువుకొన్నది. బౌద్ధమత గ్రంథాలన్నీ అవలోకించినది.

తన మేనల్లుడు, వాసిష్టీపుత్రి భట్టిదేవి కుమారిని తన పట్టపుదేవిగా చేయడం తమకు సమ్మతమే. ఈలాంటి క్లిష్టకాలంలో ఒక్కొక్క పురుషుడు ఇరువురు మువ్వురు

భార్యలను చేసుకోవలసి ఉంటుంది. పట్టమహిషి ఎవరైతే నేమీ, ఆ విషయము రాజకీయమై! ఒకసారి రాజవంశం బలపూర్ణమైతే ఆ మీద స్త్రీ పురుషుల ప్రేమయే ప్రధానం

అడివి బాపిరాజు రచనలు - 6

112

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)