పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అవుతుంది. తాను ప్రేమించి చేసుకొన్నది స్కందశ్రీ ప్రభువును. తన కొమరిత మేనల్లుని ప్రేమించింది. మేనల్లుడామెను గాఢంగా ప్రేమించాడు. వారి విహహం నిశ్చయంకాక వాసిష్టి భట్టిదేవియే పట్టమహిషి కావచ్చుగాక. అయినా స్త్రీహృదయం అతి విచిత్రమయినది. ఒక స్త్రీహృదయం ఇంకొక స్త్రీకి తెలియడం కష్టం. తన బాలిక వనదేవత కానంత మాత్రాన అంత బాధపడడం ఎందుకు? తాను మాత మీ విషయంలో ఏమిచేయగలదు? ఇంతకూ ఆ యువతీ యువకులే మనస్సు స్థిమితం చేసుకోవాలి. చెల్లెలు హమ్మశ్రీ కొమరిత బాపిశ్రీకుమారిని త్వరగా రప్పించాలని ఆ దేవి అనుకొన్నది.

ముప్ఫైఏడు ఏళ్ళు వచ్చినా, వాసిష్టశాంతశ్రీదేవి వింశతి వర్షప్రాయ. పూర్ణయౌవన మధుర్యాంగి, దివ్యసౌందర్యోజ్వల శరీరలా ఉంటుంది. ఆమె నడకలో వయ్యారము, మాటలో గాంధర్వము, కన్నులలో దీప్తి ఏ మాత్రమూ తగ్గిపోలేదు. భర్తను భగవంతునివలె పూజిస్తుంది. అన్నగారంటే దేశకునికన్న ఎక్కువ భక్తి, ఇక్ష్వాకువంశం అంటే భగవదంశా సంభూతమనే ఆమె నమ్మకం. సిద్దార్థదేవుడు ఇక్ష్వాకువంశంలోంచే ఉద్భవించాడు. ఇక్ష్వాకువంశంతో కొంచెం సమమైన వంశం శాతవాహనవంశం. ఇక్ష్వాకులకు మంచిదశలు పోవడంచేత, వారు ఇతరులకు సామంతులయ్యారు. ఇప్పుడు శాతవాహనులు నామకః చక్రవర్తులు. వారి చక్రవర్తిత్వం రక్షించేది తన అన్నగారు.

అన్నగారు శ్రీరామచంద్రుని అపరావతారము. అతిరథశ్రేష్ఠుడు. ధర్మాభిరహితుడు, రాజ్యనీతి విశారదుడు. ఆయనకు తాను ఆలోచన చెప్పునది కాదు. ఒక మహాకార్యంలో నిమగ్నులైనవారికే, ఆ పనిలోని ధర్మాలు, యుక్తాయుక్తాలు తెలుస్తాయి. అన్నగారు బ్రహ్మదత్తప్రభువుతో మంత్రాంగం సలుపుతారు. అవతారమూర్తులు నాగార్జునదేవులు ఏలాంటి క్లిష్టసమస్యనైనా నిమేషంలో తమ పవిత్రాలోచనతో విడదీస్తారు.

ఓహో! ఏమి ఆ అవతారమూర్తి ప్రతిభ! తన చిన్నతనంలోనే మొదటిసారి వారిని చూచింది. యవ్వనదశలో వివాహంకాక పూర్వం వారిని మరల దర్శించింది. తర్వాత ఏడాదికొకసారి వైశాఖ పూర్ణిమ దినాన భక్తులందరితోపాటు వారి పాదాలకెదురుగా సాష్టాంగపడుతుంది. దేశదేశాలనుండి, చీనా సువర్ణద్వీపాలనుండి వేలకువేలు భక్తులా మహాపర్వదినాన వారి ఆశ్రమానికి వస్తారు. పూర్ణిమనాటి రాత్రి శుభమూహూర్తంలో వారి పూర్ణదర్శనము ఆకాశం క్రింద లభిస్తుంది. అనాడు వారిని దర్శంచుకొన్నంత మాత్రాన సర్వపాపాలు హరిస్తాయి. వారి కర్మ పరిపక్వమై పటాపంచలై నిర్యాణము చేకూరి తీరుతుంది.

ఈ ఆలోచనలతో ఆమెకు భక్తి పారవశ్యం కలిగింది. సప్తనాగఫణి చ్ఛత్రమూర్తిగా, మహాతేజోమండల మధ్యస్థుడుగా విన్యసింపబడిన నాగార్జున దేవుని విగ్రముకడకామె వెడలినది. శాంతశ్రీ పూజాగృహంలో స్పటిక శిలా విన్యస్తమైన బుద్ధనాగార్జునదేవుల విగ్రహాలున్నాయి. వేరొకప్రక్క స్కందదేవ విగ్రహమున్నది. శాంతశ్రీదేవి బౌద్ధనాగార్జున దేవుల విగ్రహాల కడ మోకరించి ఇక్ష్వాకు వంశాభ్యుదయానికై ప్రార్ధించింది. ఆ వెనుక ఆ దేవి మనస్సు నిర్మలమై ఏదో మహాభవిష్యత్తు ధవళ గజరూపాన ఆమె అంతన్నేత్రాల ప్రత్యక్షమయింది.

అడివి బాపిరాజు రచనలు - 6

113

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)