పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ నాగార్జున దేవునకు బ్రహ్మదత్తుని నౌక గాలివానలో ఏమైనదో తిరిగిరాలేదని వార్త విన్పించినారు ముఖ్యశిష్యులు. వెంటనే ఆ దివ్యమూర్తి నవ్వి, “బ్రహ్మదత్తుడు చేయవలసిన మహోత్తమకార్యాలు ఎన్నో అలా ఉండగా ఏలా మాయంకాగలడు?” అన్నారట.

అంతే ఆయన అన్నమాటలు. వెంటనే ఆ మాటలు శాంతిమూల చక్రవర్తికి వార్త పంపించారు శిష్యులు. చక్రవర్తి ఆ మాటలు వినగానే ఎంతో ఆనందంపొంది, గుండెలలోనుండి బరువు తీసివేసినట్లయిపోవ ఆనందంలో ఆసనంపై చదికిలబడినాడు. ఆ యువకునియందు మహారాజుకున్న ప్రేమ అప్రతిమానం. ఆ మరునాడు శ్రీశైలంనుండి ధర్మదత్త మహర్షి శాంతిమూలునికి వ్రాసిన లేఖ అందింది.

“మహారాజా! బ్రహ్మదత్తుడు కారణజన్ముడు. అతని ఓడ జ్యోతిష గణనం ప్రకారం ఒక విదేశం చేరింది. అతనికి ప్రస్తుతం గండం ఏమీలేదు. ఆ బాలుడు కొలది దినాలలో తమ్మువచ్చి కలుసుకుంటాడు. ఏది ఎట్లయినా కర్మ బలవత్తరము. కర్మను ఆచరించడము, ఆ ఫలము కర్మకే వదలి పెట్టడము భగవాన్ శ్రీకృష్ణుడు సెలవిచ్చిన స్థితప్రజ్ఞుని లక్షణము మహారాజా! మీరేమీ దిగులు పెట్టుకోవద్దు. అన్నీ శుభంగా పరిణమిస్తాయి. మీ జాతకమూ, బ్రహ్మదత్తుని జాతకమూ పరస్పర గాఢసంబంధంతో చాలాకాలం వరకూ ప్రయాణం చేస్తాయి. యువరాజు జాతకానికీ, అమ్మాయి శాంతిశ్రీ జాతకానికి బ్రహ్మదత్తుని జాతకానికీ చాలా సంబంధం ఉన్నది.”

ఈ కమ్మ శ్రీనాగార్జున దేవుల కడనుండి శుభవర్తమానం వచ్చిన నాలుగు ఘడియలకే వచ్చింది. ఇక శాంతిమూలుని సంతోషానికి మేరలేదు. ఆ దినమున ఏకారణం చేతనో అన్నట్లు భిక్షులకు, బ్రాహ్మణులకు వివిధ దానాలు చేయించారు. స్కంద దేవాలయాలలో, చైత్యాలలో పూజలు విరివిగా జరుప ఆజ్ఞలు దయచేసినారు.

మహారాజు వీరపురుషదత్తప్రభువును పిలిపించి “తండ్రీ! వెంటనే పూంగీప్రోలు వెళ్ళి అత్తయ్యగారినీ, మామగారినీ, బావగారినీ, మరదలునూ మన వసంతోత్సవాలకు ఆహ్వానంవేయి. నేను పవిత్రయజ్ఞం ఒకటి తల పెట్టినాను. ఆ విషయంలో మీకందరకూ ఇక్కడనుండి వార్త వచ్చేవరకు మీరు అక్కడే ఉండండి. బ్రహ్మదత్త ప్రభువు ఓడ తిరిగి రావచ్చును” అని తెలిపినారు.

శుభముహూర్తం చూచి వీరపురషదత్త ప్రభువు సపరివారంగా పూంగీప్రోలు వెళ్ళినారు.

2

ఆంధ్రదేశంలో బౌద్ధ, జైన, అర్షమతాలు మూడూ సమంగా ముందుకు సాగిపోతూ ఉన్నాయి.

ఆంధ్రులు ఎప్పుడూ స్వాతంత్ర్యప్రియులు పరివర్తనశీలురు. వారికి “కొత్తో వింత,” అందుచే అర్షసంప్రదాయము విజృంభించి ఉన్నప్పుడు శైవము, కార్తికేయము, గాణాపత్యము, శాక్తేయము రుచిచూస్తూ ఉండేవారు. బౌద్ధధర్మాచార్యులు వచ్చి, బౌద్ధధర్మము

అడివి బాపిరాజు రచనలు - 6

111

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)