పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడు దినాలయినది, నాలుగు దినాలయినది, అయిదు, ఆరు దినాలయినది, సముద్రంనుండి ఏమీ వార్తలులేవు. గాలివాన విడిచినపిదప స్కందశ్రీ ప్రభువు తన యుద్ధనౌకలు నాల్గింటిని సముద్రం నాలుగుదిక్కులా చూచిరండని పంపినారు. ఒక ఓడ ఉత్తరంగానూ, ఒక ఓడ వాయువ్యంగానూ, ఒకటి ఆగ్నేయంగానూ, ఒకటి దక్షిణంగానూ బయలుదేరాయి.

ఓడలు బయలుదేరి మూడు దినాలయినది. అవి తిరిగి రాలేదు. తీరానికి ఇరవై ముప్పై యోజనాల దూరంలో ఏ ఓడయినా మునిగిపోతే నాలుగు దినాలకో, అయిదు దినాలకో శవాలూ శకలాలూ తీరానికి వస్తాయట. అలాంటి వానిని వెదకటానికి సముద్రతీరం పొడుగునా గూఢచారులను, నావికులను ఉత్తరంగా దక్షిణంగా పంపినారు స్కందశ్రీప్రభువు.

పది దినాలయినది, వార్తలు లేవు. ఇంక స్కందశ్రీప్రభువు విజయపురికి ఈ విషాదవార్త ఏలాగు పంపించకుండా ఉండగలడు? ఉన్న విషయాలన్నీ భూర్జపత్రంమీద లిఖించి ధైర్యం చెపుతూ స్కందశ్రీ పూంగీయ ప్రభువు శాంతిమూల మహారాజుకు నమ్మిన సందేశహరునిద్వారా నివేదించడానికి పంపినారు.

అంతఃపురంలో శాంతిశ్రీరాణికి రాకుమారి శాంతశ్రీకి బ్రహ్మదత్తుని ఓడగాలి పాలైంది అని తెలిసినప్పటినుండీ ఏదో భయ మావరించింది.

ఇచ్చట పూంగీయమహారాణి భర్తగారిని కలుసుకున్నది.

“ప్రభూ! ధనకప్రభువు క్షేమంగా తిరిగివస్తారా?”

“ఏమి చెప్పగలం దేవీ?"

“తాము కార్తాంతికులను కనుక్కోకూడదా?”

“మంచిమాట దేవీ ! వెంటనే జ్యోతిష్కుల పిలువనంపుతాను.”

9

అడవిస్కంద విశాఖాయనక బ్రహ్మదత్త ప్రభువు నౌకావిహారానికి వెళ్ళినాడనిన్నీ, సముద్రంలో ప్రళయ ఝంఝామారుతము విసిరిందనీ, బ్రహ్మదత్త ప్రభువుగానీ ఆయన ప్రయాణించే ఓడగానీ జాడైనా లేదనీ పూంగీయ స్కంద విశాఖప్రభువు కమ్మ పంపగానే శాంతిమూల మహారాజు నిర్విణ్ణుడై నిముషములు మాటలాడలేకపోయినాడు.

బ్రహ్మదత్తప్రభువు ఈ ధనకదేశంలో శాతవాహనులతోపాటు రాజ్యంచేసిన ఉత్తమ బ్రాహ్మణవంశంలోవాడు. ప్రతీపాలపురపు ఇక్ష్వాకులకు స్నేహితులై, వారికి కుడిచేయిగా ఉండి వారు మహాసామంతులైనప్పుడు, వారికే సామంతులైనారు ధనక వంశంవారు. ప్రజ్ఞావంతులు, విజ్ఞానధనులను, పరాక్రమ శీలురను కనిన ఈవంశానికి మేటి కిరీటంలా బ్రహ్మదత్తుడు ఉద్భవించాడు.

సకల భారతావనియందూ ధనకరాజ్యమూ, ఇక్ష్వాకుల పాలనంలో ఉన్న కురవ, చోళ, ములక, ఆటవిరాష్ట్రాలూ రామరాజ్యంకన్న ఎక్కువగా పరిపాలించే విధానాలు ఏర్పాటు చేసిన రాజనీతివిశారదుడు ధర్మదత్తప్రభువు. తామా ధర్మదత్తుడు రామలక్ష్మణులా పెరిగినారు

అడివి బాపిరాజు రచనలు - 6

105

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)