పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యువరాజున్నూ అనందం పొందుతారు. మహారాజకుమారి శాంతిశ్రీ ఏమనుకొంటుంది? మహారాజు బలవంతం చేసి అప్పగించిన గురువు వదలినాడు అని ఆనందిస్తో ఉండే బాలిక, తాను తిరిగి వెళ్ళగానే మళ్ళీ దాపురించాడు ఈ పిశాచి అనుకుంటుంది. ఇంత గాటంగా తనకీ ఆలోచన ఎందుకు కలగాలని బ్రహ్మదత్తుడే ఆశ్చర్యం పొందినాడు.

ఓడ మునిగిపోవచ్చునన్న సమయంలో ఆ అద్భుత సుందరాంగి మోము స్పష్టంగా తనకు ప్రత్యక్షమయింది. తన ఆలోచనా పథాలలో ఆ బాలిక ఎప్పుడూ ప్రత్యక్షమౌతూ ఉన్నది. ఆమె దివ్యమధురవాణి తన హృదయాన్ని గగ్గోలు పరుస్తుంది. తాను ధర్మాభిరతుడే కాని చిత్తాభిరతుడు కానని అనుకున్నాడు. తన మనస్సు ఏలాంటి సమయములోను వికారం పొందలేదు. కాని ఆ లోకైకసుందరిని మహారాజు తనకు శిష్యురాలినిగా చేసినప్పటినుండి తన మనోగతే మారిపోయింది. తన్నేదో ఆనందమత్తత ముంచివేయడం సాగించింది. ఆ బాలికను చూడడము, ఆ బాలిక మాటలు వినడం జన్మకు సాఫల్యం చేకూర్చినాయి అన్న భావం ఏర్పడింది. శాంతి మూలమహారాజుతో జైత్రయాత్రకు వెళ్ళినప్పుడూ అంతే.

ఆమె స్వచ్ఛ సువర్ణాంగాలు, ఆమె మధురకంఠకాకలీన్వనాలు తనకు మతిని పోగొట్టేవి. కాని ఆ బాలిక మాత్రం తన్ను లెక్కచేయకుండానే సగౌరవంగా పాఠాలు చుదువుకొనేది. బ్రహ్మదత్తప్రభువు ఆ బాలికాగతమైన మనస్సు మరలించుకొనే యత్నం మానివేసి ఆ భావమే తన్ను అమృత ప్రవామై ముంచివేయ, అందులో విచిత్రానందంతో తేలిపోసాగినాడు.

8

తన నౌక చిన్నదైనా ఏలాంటి గాలివాననైన ఎదుర్కోగలదని కొంత ధైర్యం పొందినారు పూంగీయ స్కందశ్రీ ప్రభువు. నౌకానాయకుడు ఐంద్రత్తుడు నావికులలో అగ్రగణ్యుడు అనేది కూడా కొంత ధైర్యం సమకూర్చింది. అయినా వేసవికాలంలో గాలివానవస్తే అతిభయంకరంగా వస్తుంది. రాళ్ళవర్షంతో కలిసివచ్చే భయం కూడా ఉంది. బ్రహ్మదత్తుడు ఓడ ప్రయాణం చేసి ఎరగడు. అతడు మహాజ్ఞాని. యువకుడయినా పెద్దలందరూ గౌరవించే రాజ్యాంగవేత్త, ప్రజారంజకుడు, ప్రియదర్శి, ఉత్తమ బ్రాహ్మణుడు. శాంతిమూలమహారాజు కాయన అత్యంతప్రియుడు, మహారాజుకు బ్రహ్మదత్తప్రభువు అల్లుడు కావచ్చుననికూడ కర్ణాకర్ణిగా విన్నాడు.

తాను బ్రహ్మదత్తప్రభువును ఓడ ప్రయాణము చేయనివ్వకుండా ఉండవలసింది అని స్కందశ్రీ పూంగీయప్రభువు చెదిరిన మనస్సుతో సేవకుల పంపి రేవునుండి ఎప్పటి వార్తలప్పటికి తెప్పించుకొంటూ ఉండెను. ప్రళయంగా గాలివాన వచ్చి సముద్రతీరం దేశంమీద తాకిందనీ, సముద్రంలో ప్రయాణం చేస్తున్న ఓడలకిది ఎక్కువ మొప్పమనీ నావికులలో అనుభవంగల వారివల్ల స్కందశ్రీ ప్రభువునకు వార్తలందాయి. నేలమీద ముసురు వానగాలితో దినమున్నర ఉంది. ఆ వెనుక ఫెళ్ళున ఎండ కాసింది. ఈ ముసురు, ఝంఝామారుతము సముద్రంమీద రెండుదినాలపైగా ఉంటుందని నావికులు స్కందశ్రీ ప్రభువునకు విన్నవించారు.

అడివి బాపిరాజు రచనలు - 6

104

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)