పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“బ్రహ్మదత్త ప్రభువులా! చాలా ఆనందం! ఎంతో ఆనందంగా వుంది. కథలులా విన్నాము మా జన్మదేశం గురించి.”

కన్హ శాతవాహనుని భాష బ్రహ్మదత్తప్రభువునకు అర్థం కాలేదు. ఆంధ్రభాష ఎప్పటికప్పుడు మారుతూ ఉన్నది. కన్హ శాతవాహనుని భాష గౌతమీపుత్రుని కాలమునాటి ఆంధ్రముతో సువర్ణ ద్వీపభాష బాగా మిశ్రమం చేసిన భాష. ఆ భాష ఐంద్రదత్తునికి బాగా తెలుసును. ప్రభువులిద్దరూ ఒకరినొకరు నమస్కారం చేసిన తర్వాత ఐంద్రదత్తుడు సగౌరవంగా సమీపాన నిలబడి ఒకరిభాష ఒకరికి తెలియచెప్పుతూ ద్విభాషి అయినాడు.

“ఇక్కడ మన దేశస్థులు ఎంతమంది ఉన్నారు ప్రభూ!”

“ఆంధ్రదేశం వివిధ భాగాలనుండి వచ్చినవారు ఈ చుట్టుప్రక్కల ఇరువదివేల మంది ఉంటారు. అందులో పన్నెండువేల మంది సైనికులే!”

“ఈ శస్థలకూ, మనవారికీ పొత్తు బాగా ఉన్నదా?”

“అవును ప్రభూ! ఈ ద్వీపవాసులకు మాకూ అఖండస్నేహం. చాలాకాలం క్రిందటే ఇక్కడ తధాగత ధర్మం బాగా ప్రాకింది. అంతకు ముందు నుండి కూడా మనదేశాన్నుండి రత్నవర్తకానికి చాలామంది వణిక్కులు వస్తూ ఉండేవారు. ఇప్పటికి సుమారు రెండువందల సంవత్సరాల క్రితం మా పూర్వీకులయిన ప్రభువు కొన్ని కుటుంబాలతో, వేయి మంది వీరులతో ఈ పట్టణ ప్రాంతాలనే దిగి, ఇక్కడ ఈ కోట నిర్మించారు. ఈ కోటచుట్టూ ఈ మహాపట్టణం పెరిగిందట.”

“ తాము మన దేశం వచ్చినారా ఎప్పుడైనా?”

“లేదు. యువరాజు నిచటనిలిపి, ఎప్పుడైనా రావాలనీ, అక్కడి క్షేత్రాలన్నీ దర్శించాలని కుతూహలం. మేము ఇక్కడి రాజకుటుంబాలతో సంబంధ బాంధవ్యాలు నెరపుతున్నాము. మా తల్లిగారు అమరపుర మహారాజుగారి తనయ. నేడక్కడ మా మేనమామగారు రాజ్యం చేస్తున్నారు.”

“తమ పోలికలు అన్నీ మన దేశంలోని ప్రభువుల పోలికలే.”

“నేను మా తండ్రిగారి పోలిక. మా తండ్రిగారు మన దేశంలో పుట్టినారు. మా నాయనమ్మగారు ఆంధ్రదేశపు ఆడబడుచు. మా నాయనగారి పురుడుకోసం ఆ దేశమే వెళ్ళినారట! తాము మాకు అతిథులు కావటంవల్ల ధన్యులం.”

బ్రహ్మదత్తప్రభువు ఓడలో ఉండడం మంచిదికాదని, తమ అతిథి భవనంలో విడిది చేయాలనీ కన్హ శాతవాహనుల మహారాజు కోరినారు. కాబట్టి బ్రహ్మదత్తప్రభువు ఆ అతిథి మందిరం ప్రవేశించారు. ఐంద్రదత్తుడు ఓడలోనికి పోయి బ్రహ్మదత్తుని సేవకునీ, వంటబ్రాహ్మణునీ, పెట్టెలనూ, ఆయుధ పెటికనూ పంపెను.

తనకోసం పూంగీప్రోలులో, విజయపురంలో ఆతురతతో ఉంటారు. ఉండని! మళ్ళీ సముద్రందాటి వెళ్ళడము జరుగునా? ఇంతవరకు తన ఓడ సురక్షితంగా రేవుచేరడమే ఆశ్చర్యం. మళ్ళీ సురక్షితంగా తిరుగు ప్రయాణం చేస్తుందని నమ్మకం ఏమిటి? ఒకవేళ తాను సురక్షితంగా తన దేశం చేరితే మృత్యుముఖాన్నుండి బయటపడిన వానిని చూచినట్లు చూస్తారు తన తల్లిగారు. శాంతిమూల మహారాజు వీరపురుషదత్త

అడివి బాపిరాజు రచనలు - 6

103

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)