పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తనకన్న కొలది సంవత్సరాలే పెద్ద అయినా ధర్మదత్తప్రభువు తనకు సర్వశాస్త్రాలలోనూ గురువై, మంత్రియై సేనాపతి అయినాడు. ధర్మదత్తు డిప్పుడు మహర్షి, తపసు చేసుకొంటున్నాడు. ఆయన తపస్సునకు వెళ్ళేటప్పుడు తన కుమారుని సన్యాసి కాకుండా చూడండనీ, వాడు ఇక్ష్వాకువంశ భారంవహించే శేషుడవుతాడనీ, వానివలన భవిష్యదాంధ్ర చక్రవర్తివంశం ఒకటి ఉద్భవిస్తుందనీ తెలిపినారు.

తాను, ధర్మదత్తప్రభువూ తమకు బిడ్డలు కలుగగానే వియ్యమంద నిశ్చయించు కొన్నారు. ధర్మదత్తునకు స్కందవిశాఖప్రభువు జన్మించినాడు. అతనికిచ్చి ఉద్వాహం చేయడానికి కొమరితకై తాను తపస్సు చేసినాడు. తనకు శాంతిశ్రీ కుమారికలుగగానే తననోములు ఫలించాయని ఆనందించినాడు. తన బాలిక సాధారణ బాలికవలెగాక విచిత్రస్వభావముగా పెరుగుచున్న కొలదీ, తన దురదృష్టానికి ఎంతవగచినాడు తాను! బాలిక విజ్ఞానవతియే అయినా, అర్థ్రచిత్తతలేని అమాయిక శిశువుగా పెరిగింది. ఏలాగైనా వారిద్దరూ ప్రేమించుకోవాలి. వారిద్దరూ ఆదర్శదంపతులు కావాలి అని ఆశిస్తూ ఉంది, బ్రహ్మదత్తుని తన బాలికకు గురువునే చేసినాడు. అయినా మహారాజు మనస్సు ఎందుకో శంకిస్తూనే ఉండేది.

ఇంతలో ఈనాడు ఆ బాలకుడు ఏమైనాడు? ఆ నౌక ఏమై పోయినది? తానెందుకు ఆ కుమారప్రభువును, ఆ సుందరమూర్తిని పూంగీప్రోలు పంపినాడు? అది ఏదో చెడు ముహూర్తమై ఉంటుంది. శాంతిమూలుని ఆవేదన వర్ణనాతీతమైనది. శాంతిమూలుడంత బాధ ఎన్నడూ పడలేదు. ఆ మహారాజు గంభీరుడు, విరాగి, అయినా నేడు బ్రహ్మదత్తప్రభువు నౌకలో విహారంపోయి గాలివానవల్ల ఏమయిపోయినాడో తెలియకుండా మాయమైనాడు అని వినగానే వికలమనస్కుడై పోయినాడు. ఆయన వెంటనే ఈ వార్త బోధిసత్వనాగార్జునార్హ దేవులకు, మహర్షి ధర్మదత్తులవారికి తెలియ నంపెను.

ధర్మగిరిపై (నాగార్జునకొండపై) ఉన్న శ్రీ నాగార్జునిదేవులకీ వార్త పంపడానికి ఆయన సాహసించడానికి కారణం ఆ శతవృద్ధులైన పరమ శ్రమణకుడు బ్రహ్మదత్తుడంటే అత్యంత ప్రేమగలవారు. వారే బ్రహ్మదత్తుని ఉదంతం గురించి తనకు ఇదమిద్దమని చెప్పగలవారు. ధర్మదత్తమహర్షీ అట్టిప్రజ్ఞావంతులే. ఇక ఈ కఠినవార్త ఏలాగు బ్రహ్మదత్తుని తల్లిగారికి వినిపించడం? మహారాజు ఆలోచనాధీనుడై మహారాణి సారసికాదేవికీ, కుసుమలతాదేవికీ, రాజకుమారి శాంతిశ్రీకి తాము వారివారిని అంతఃపురాలలో సందర్శిస్తామని సందేశం పంపినారు.

సారసికాదేవి పట్టమహిషి. ఆమెకడకు మహారాజు పోయినప్పుడు ఆ దేవి భర్తపాదాలకు నమస్కరించి ఉచితాసనంపై వారి నధివసింపచేసి, “మహాప్రభూ! తాము ఏదో ముఖ్యవిషయం మాట్లాడవచ్చినారు?” అని ఆమె అడిగినది. ఆమె మహారాజు మోముచూచి, అందున్న ఆలోచనాధీనత కనుగొని హృదయము ఝల్లుమన "మహాప్రభూ! తమ వదనంపై ఏదో విషాదచ్చాయ ప్రసరించి ఉన్నది?” అన్నది.

“అవును దేవీ విషాద విషయమే!”

“ఏమది మహాప్రభూ?”

అడివి బాపిరాజు రచనలు - 6

106

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)