పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“ఎవరూ నష్టం కాలేదుకదా?”

“అందరూ క్షేమం మహాప్రభూ! ఓడ ఏమీ ఎరుగని నంగనాచిలా ప్రయాణం చేస్తున్నది”

“ఆశ్చర్యమే!”

“చిత్తం.”

“స్నానానికి నీళ్ళు సిద్ధంగా ఉన్నాయా?”

“చిత్తం!”

“మన నౌక ఎక్కడ ఉన్నట్లు?”

“మనం దారితప్పి కొన్ని వందల యోజనాలు వచ్చినామట మహాప్రభూ! రావడంవల్ల సువర్ణద్వీపం దరిదరికి వచ్చినామేమోనని, అతని అంచనా ప్రకారం సువర్ణదీవి నలభై యోజనాల దూరంలో ఉంటుందేమోనని. ఇంక మూడున్నర దినాలలో మనం సువర్ణ ద్వీపమో, మలయా ద్వీపమో చేరగలమని అన్నాడు.”

“అబ్బా! భగవంతుని లీలావిశేషమే!”

బ్రహ్మదత్తప్రభువు స్నానంచేసి సంధ్యావందనాదికా లొనరించి, సముచితవేషంతో తటమీదకు వెళ్ళినాడు. అప్పుడే నావికులందరూ తట్టు మీదికివచ్చి తెరచాపకొయ్యలు ఎత్తివారూ, తెరచాపలు తగిలించువారూ పగ్గాలు బిగించువారునై యుండిరి.

7

ఓడ మూడ దినాలకు సువర్ణ దీవితీరాలకు వచ్చింది. తీరంవెంట ఐంద్రదత్తు (నౌకా నాయకుడు) తన చిన్ననౌకను నడుపుకుంటూ మాయామాయా నగరమురేవు చేరెను. ఆ పట్టణంలో సువర్ణులూ, ఆంధ్రులూ కలిసి ఉన్నారు. అక్కడక్కడ కళింగాంధ్రులు, ఉత్తరకళింగులు, మాగధులు, పాండ్యులు కొన్ని కొన్ని కుటుంబాలవారున్నారు. సువర్ణులు నాగవంశీకులు. గుండ్రని పలచనిమోము, మీసాలు తక్కువ, పసుపుపచ్చని ఛాయ, కళ్ళు కొంచెం వంకర, ఒత్తయిన పెదవులు. సువర్ణనాగులలో ఒక విధమైన సౌందర్యం ఉన్నది. ఇక్కడకు వలస వచ్చిన ఆంధ్రులు గుండ్రని తమ పైశాచప్రాకృతలిపి వీరికి నేర్పినారు. సువర్ణులు కొంచెం అనువాసికంగా మాట్లాడువారు. మాయామాయా పట్టణము ఆంధ్ర శాతవాహన కాలంలో నిర్మించినారు. ఆనాటి నుండి ఆ పట్టణము దినదినాభివృద్ధినంది ఈనాటికి సువర్ణద్వీపములోని ముఖ్యపట్టణమైనది.

ఐంద్రదత్తుడు ఇదివరకు అనేక పర్యాయాలు మాయామాయా పట్టణానికి విచ్చేసినాడు. మహాఘనము (లంగరు) దింపి ఓడను రేపులో బంధించి ఓడ దగ్గరకు వచ్చిన చిన్ననావలో నెక్కి అందరూ పట్టణం చేరిరి. ఐంద్రదత్తుడు ఒక నాగశిబికను మాటలాడి అందు బ్రహ్మదత్త ప్రభువును ఎక్కించి, తానొక పొట్టిగుఱ్ఱము నధిరోహించి మాయామాయా పట్టణ పాలకుడైన ఆంధ్రప్రభువగు కన్హ శాతవాహనరాజు కడకు కొనిపోయినాడు. కన్హ శాతవాహనప్రభువు అడవి ధనక స్కందవిశాఖాయనక బ్రహ్మదత్తప్రభువు రాక విని ఆశ్చర్యంతో తన సభాభవనానికి విచ్చేసినారు.

అడివి బాపిరాజు రచనలు - 6

102

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)