పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉరికింది. ఇంత చిన్న ఓడ ఈ దాడికి ఆగుతుందని నమ్మకంలేదు. పూంగీమహారాజు, విజయపురానికి వెంటనే గజవార్తలు పంపును. తన్ను గురించి దుఃఖించేది తన తల్లి, తండ్రికి ప్రపంచ సుఖదుఃఖాలు అంటనే అంటవు. ఇంక శాంతిమూల చక్రవర్తి తన్ను యువరాజుతోపాటు ప్రేమించారు. ఆయన కొంచెం దుఃఖించవచ్చును. -

గాలివాన తుంపర మంచుగడ్డల వర్షంలాగ గజగజలాండిచే చలిలో నీటి మట్టానికి సమంగా మహావేగంతో లోకాన్ని ముంచెత్తుతూ ఉంది. కారు మేఘాలు కమ్మిచీకటిపడే సమయంలా ఉన్నది. ఆకాశాన్ని అంటే కల్లోలాలు ఒకదానికొకటి తగిలి ఫెళ్ళున పేలుతున్నాయి. ఆ కల్లోలాల నీటి తుంపరలు చేటల కొద్దీ తట్టుపైన పడుతున్నవి. ఒక్కొక్క కల్లోలం కోటిగదాఘాతాల శక్తితో నౌకను మోదుతున్నది. కెరటాల శక్తికి ఓడ మహావేగంగా పూర్వాభి ముఖమై వెళ్ళిపోతున్నది. -

బట్టలన్నీ తడిపి, దేహమంతాతడిసి చలి గాఢంగా పొదివికొన్నది. జుట్టు విడిపోయి బ్రహ్మదత్తప్రభువు తలచుట్టు చిన్న చిన్న నీలికాంతులులా ప్రసరించి ఉంది. కాని ఆ యువక రాకుమారుని హృదయంలో ఏదోమహానందం! పైన సర్వలోకమూ ఏదో భయంకర ఘోషతో బాణపాతంవంటి గాలివానతో శ్రుతికలిపి తాండవిస్తున్నది.

పథములన్నీ ఆవరించిన
ప్రళయదేవత తాండవించూ
ఫెళ ఫేళారావముల అందెలు
ప్రియము నా హృదయానికిన్.

ఎన్ని ముహూర్తాలు అలాప్రళయంలో భాగమై కోడ ప్రయాణించిందో? బ్రహ్మదత్తప్రభువు లోని భాగానికిపోయే తలుపుతట్టి లోనికి వెడలిపోయేను. నాయకునీ, చుక్కానివానినీ లోనికి పంపేందుకు ఇతరులు వెళ్ళి వాళ్ళస్థలాలు ఆక్రమించినారు. బ్రహ్మదత్త ప్రభువు వేడినీరు స్నానమాచరించి రాంకవ వస్త్రాలు ధరించి, భోజనమాచరించి, శయనించి నిదురపోయినాడు. కొన్ని జాములు గాలివానలో భాగమైపోయినందున ఆ ప్రభువునకు ఒళ్ళు తెలియని నిదురపట్టింది. ఎంతకాలము గాలివాన వీచినదో, బ్రహ్మదత్త ప్రభువునకు మెలకువ వచ్చునప్పటికి నిమ్మకునీరు పోసినట్లున్నది. బ్రహ్మదత్తుడు చటుక్కున లేచి ప్రక్కనున్న జయఘంటిక మ్రోగించినాడు. వెంటనే సేవకుడు పరుగెత్తుకొని వచ్చినాడు.

“ప్రభూ!”

“ఎంత ప్రొద్దుపోయింది?”

“ఉదయం మహాప్రభూ!”

“నేను ఆరుయామాలు నిద్రించినానా?”

“చిత్తం దేవా!”

“గాలివాన తగ్గినదా?”

“నిమ్మకు నీరు పోసినట్లున్నది”

“ఓడ!”

“ఒక్కసారి చుక్కాని విరిగిపోయింది. మళ్ళీ ఇంకో చుక్కాని కట్టినారు.”

అడివి బాపిరాజు రచనలు - 6

101

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)