పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“ఏమీ భయం లేదయ్యా! ఇప్పుడీ ఝంఝామారతమే నా స్నేహితుడు, గురువూనూ! ఆయన దర్శనంకోసమే ఉవ్విళ్ళూరుతున్నాను.”

ఆ నాయకుడు బ్రహ్మదత్తప్రభువువంక ఆశ్చర్యపడి చూచినాడు. ఆయన మోము ఆనందంతో నిండి ప్రకాశమానమైంది.

నాయకుడు విసవిస వెడలపోయి నావికులతో తెరచాపలూ, ఆకాశాన్ని చుంబించేటట్లున్న స్తంభాలు దింపించివేశాడు. తట్లమీదున్న ప్రతివస్తువు లోపలికి పంపించివేశాడు. చివర పని జరిగిందో లేదో, మేఘాలు పడవపైకి వచ్చి వేసినవి. ఒక మహాకల్లోలము మేఘమంతైవచ్చి ఓడమీద విరుచుకు పడింది. బ్రహ్మదత్తప్రభువు ముందు కానులో ఒక మధ్యకొయ్యను గట్టిగా పట్టుకుని నిలిచి ఉన్నారు. ఆ మహాకల్లోలము ఆకాశమంటివస్తున్నది. నౌక లోనికి ఉరికేందుకు వ్యవధిలేదు. ఆ మహావాయువు రాబోతున్నదని ఊహించి, ఆ ప్రభువు ఉత్తరీయము నడుమునకు బిగించి, నావికులు తమ ధోవతులను పైకి బిగించికట్టినట్లు కట్టుకున్నారు. ఆ కల్లోలము విరుచుకు నౌకమీద పడింది. వెంటనే ఆ కొయ్యను గట్టిగా కౌగిలించి పట్టుకొని, ఊపిరిబిగించుకొన్నాడు. చుక్కాని నడుపు మనుష్యుడు తాడుతో చుక్కాని కొయ్యను తన్నుదా కట్టుకొన్నాడు.

ఓడమీద ఆ మహాకల్లోలం విరుచుకుబడబోయేముందే చుక్కానివాడు ఓడను పక్కగా త్రిప్పివేసినాడు. కాబట్టి ఓడ అడ్డదెబ్బ తినలేదు. నావికులందరు లోనికిపోయి తట్టుతలుపులు లోపల బిగించుకున్నారు. నాయకుడు మాత్రం ముందు భాగాన్న ఉన్న జలదేవతా విగ్రహానికి తన్ను కట్టివేసికున్నాడు. కల్లోలము ఓడపైకి దుమికి ఓడను సముద్రగర్భానికి తీసుకొనిపోయి పైకి తేల్చింది. దైనందినము హఠయోగా మాచరించే బ్రహ్మదత్తప్రభువు కల్లోలము విరుచుకుపడగానే కఱ్ఱలో కఱ్ఱ అయినాడు. ఆయన చిన్నకొయ్యలో కొయ్య అయి ఇనుపగొలుసు బిగించినట్లు భల్లూకం పట్టుపట్టినట్లు కొయ్యను కౌగిలించుకొన్నాడు.

6

ఆ కల్లోలము నౌకపైనుండి ఏనుగు లేడికూనను దాటిపోయినట్లు దాటి పోయినది. ఓడవంగిపోయి, తిరిగి సర్దుకుంది. తట్టుపైనఉన్న ముగ్గురు సముద్రంలోనికి కొట్టుకు పోలేదు. కాని ప్రాణంపోవడం తప్పి కన్నులు లొట్టపోయినట్లయింది వారికి. ఆ మహా కల్లోలము వెళ్ళిన దగ్గరనుండీ ఉత్తుంగ తరంగాలు ఓడతో కందుక క్రీడచేస్తున్నాయి. ఓడ మరుసటి ముహూర్తంలో చిన్న చిన్న ముక్కలక్రింద బద్దలుకొట్టేటట్లున్నాయి ఆ భయంకర తరంగాలు. అలాంటి సమయములో ఓడ నడపడం పద్మవ్యూహం చీల్చి వెళ్ళడం వంటిదే! నావికా నాయకుడు, చుక్కానివాడు ఈ లాంటి గాలివానలలో ఎన్నిసారులు ద్వీపాంతరాలకు పోయి వచ్చినారో? కెరటాలకు అడ్డుకోణంగా లేకపోవడంవల్ల గాలికి ఎదురునడవక గాలితో పాటే పోవడంవల్లా ఓడ శర వేగంతో ముందుకు సాగిపోతున్నది.

ఓడ ఎక్కడకు పోతున్నదో? రాచకార్యంకోసంవచ్చి, తీరికూర్చుండి తాను పడవమీద ప్రయాణం చేయడమేమిటి? పూంగీప్రోలులో స్కందశ్రీ ప్రభువుతో తానొకదినము సముద్రవిహారం చేసివస్తాననికదా తెలిపినాడు. ఇంతలో ఈ విశ్వంలో ఏమూల దాగుకొని ఉన్నదో ఈ ప్రళయ ఝంఝామారుతం అదను కనిపెట్టి ఒక్క ఉరుకున తనమీదకు

అడివి బాపిరాజు రచనలు - 6

100

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)