పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32

అబలాసచ్చరిత్ర రత్నమాల.

చున్నది. కాన నీప్రథమదివసంబుననే తమరు నావిడిదికి దయచేసి నేచేయుపూజల నంగీకరింతురని నమ్ముచున్నాను. ఈ నాచిన్న విన్నపము మీరంగీకరింపకతప్పదు." బాదుషాయొక్క నమ్రత్వమును గని యాతనిమాటలను నమ్మి భీమసింహుఁడు మితపరివారముతో నాతని శిబిరంబునకుఁ బ్రయాణ మయ్యెను.

అల్లా ఉద్దీను మిగుల దుర్మార్గుఁ డగుటవలన రాజుగారిని నమ్మించి తనతోఁ దోడుకొనివచ్చి తనశిబిరసమీపమునం దాయనను సైన్యము ముట్టడించి కైదుచేయునట్లు చేసెను. రాజు పట్టుపడుటవలన మిగుల నుప్పొంగి యల్లాఉద్దిన్ చితూరున కిట్లు వర్తమాన మంపెను. "పద్మిని నావద్దకు రానియెడల భీమసింహుని ప్రాణములఁగొని మరల రజపూతులను సంహరించెదను." ఈసంగతి విని రజపూతులందఱు నేమి చేయుటకును దోఁచక మిగుల విచారముగా నుండిరి. రాజగు లక్ష్మసింహుఁడు బాలుఁడగుటవలనను, భీమసింహునిపుత్రులు పండ్రెండుగురును అల్పవయస్కు లగుటవలనను ఇట్టిసమయమునం దగినయుపాయము యోచించువారు కానరారయిరి. కాని పద్మినిమాత్ర మప్పుడితర స్త్రీలవలె దు:ఖింపుచుఁ గూర్చుండక మిగుల ధైర్యము వహించి భర్తనువిడిపించు నుపాయము యోచింపుచుండెను. ఆసమయమునం దేదోపనిమీఁద నామె సోదరుఁడగు గోరాసింహుఁడును, నాతనిపుత్రుఁడగు బాదలుఁడను వీరుఁడును అచటికివచ్చిరి. ఆమె వారితో యోచించి మిగుల చిత్రమగుయుక్తినిఁ బన్నెను. పద్మిని అల్లా ఉద్దీనున కిట్లు వర్తమానము చేసెను. "మీరు భీమసింహునివిడిచి డిల్లీకిఁ బయలుదేఱినయెడల నేను తగుదాసీలతోడంగూడి యచటికి వచ్చెదను.