పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గొప్ప బహుమానము దొరకునని నిశ్చయించుకొని యుండెను. సాయంకాలము కాగానే, యావారకాంత యాదినము జరిగిన వృత్తాంత మంతయు లాలుదాసునకు దెలిపి, వీరమతి పెనిమిటి పేరు చెప్పి, యతని బట్టి కారాగృహములో వేయించి, రాత్రికి నతనిని (లాలుదాసును) తనయింటికి రమ్మని చెప్పెను. ఆ నరాధముడు రాత్రి నియమితకాలమునకు వేషమువేసికొని, సురాపానము చేసి, జామోతి గృహమునకురాగా ఆచండాలిని పుచ్చుకొనవలసిన ధనమంతయు బుచ్చుకొని, యతనికి వీరమతి యున్న మేడ జూపి, తన నివాసస్థలమునకు వెళ్ళిపోయెను. ఆ నరధాముడు మేడయెక్కునప్పుడయిన చప్పుడువిని, భర్తృధ్యానరత యై న చరిత్రనాయిక, తనభర్త వచ్చెనని తలంచి సంతసించెను గాని, యాకీచకుడు లోనికిరాగా వానిభయంకరమైన స్వరూపమునుజూచి పరపురుషుడని యెరిగి గజగజవడక సాగెను. అంతలో రాజస్త్రీలకు స్వాభావికమైన ధైర్యము నవలంబించి, యెన్నియో బోధవచనములచే నా దుష్టుని దుర్మార్గమునుండి తొలగింపయత్నించెను. ఆ మాటలువినక, ఆ నరపశువు, మదోన్మత్తుడయి, వివేకశూన్యుడై, వీరమతియొక్క పవిత్ర దేహమును దనపాపపు హస్తములతో స్పర్శించుటకై యత్నించెను. ఇక నూరకుండిన మానమునకు భంగము కలుగునని తలచి, యాయతులపరాక్రమశీల యగు అబల, తన నడుములోని గుప్తఖడ్గము సర్రున దీసి యా నరాధముని రెండు తునకలుగా ద్రుంచెను. ఈఖడ్గ మెక్కడిది యని చదువరులకు సందేహము వచ్చునేమో, ఆ కాలపు ప్రతిరాజపుత్ర స్త్రీకి