పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంస్థానమునకు బయలుదేరెను. కాని యంతలో దన సహధర్మచారిణియగు వీరమతినిజూచి, యామె యనుజ్ఞ వడసి, పట్టణమునకు వెళ్లుదమనితలచి, గుర్రమును టకుటేడా పట్టణము వైపునకు ద్రిప్పెను. ఇట్లు జగదేవుడు బయలుదేరి కొన్ని దినములకు టకుటేడా గ్రామసమీపమున నున్న యొక యుద్యానవనము చేరెను. అచ్చటికి జేరువరకు సాయంకాలమైనందు వలనను, గుర్రము ప్రవాసముచే నత్యంతాయాసము పడినందువలనను, అచ్చట కొద్దికాలము శ్రమ దీర్చుకొని, రాత్రి వెన్నెలలో గ్రామము చేరవచ్చునని దలచి, జగదేవు డా యుద్యానములోనికి వెళ్లి, గుర్రమును విడిచి, తాను ఫలాహారము చేసి నిదురించెను.

జగదేవుని వెడలగొట్టిన తరువాత వాఘేలిరాణి వెంటనే కొందరు దుర్మార్గులకు ధనాశ జూపి జగదేవుని ద్రోవలో దెగటార్చి రండని వారిని బంపెను. జగదేవుడు వెళ్ళిన దిక్కునకే వారు వెళ్లిరి; గాని తన సవతితల్లి తనను జంపుటకై యిటుల మనుష్యులను బంపునేమో యని తలచి, జగదేవుడు పెద్ద త్రోవను విడిచి వంకర దారిని నడుచుచుండెను. కనుక వాఘేలీ పంపిన మనుష్యుల కతడు త్రోవలో గనుపడినవాడు కాడు. పైని వర్ణించిన యుద్యానవనములో నిదురించినపుడు, ఆనలుగురు మనుష్యులచ్చట బ్రవేశించి, నిదురించుచున్న రాజపుత్రుని బంధించి యడవిలోనికి గొనిపోయిరి. ఇంతలో దైవవశమున వీరమతియు, నామె చెలికత్తెయు బురుష వేషములు వేసికొని, వేటాడి యా వనములోనికి వచ్చిరి. అప్పుడచటి సేవకజనము లామెతో నెవరో రాజపుత్రు డచ్చటికి వచ్చెననియు, నిద్రించుచున్న