పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నుండియు సోళంకిరాణియు, జగదేవుడును, పూర్వగృహమునందుండక రాజగృహమునందే యుండిరి. కొన్నిరోజు లత్తవారి యింటనుండి, వీరమతి పుట్టినింటికి వెళ్ళెను.

రాజగృహమునందుండి, రోజును రాజసభకువచ్చి రాజకార్యము లనేకములు నిర్వహించుచుండుటవలన జగదేవునికీర్తి దినదినము వృద్ధినిజెంది సభవారందరును, అతనినే ప్రేమించు చుండిరి. వాఘేలీకుమారు డయిన రణధవళుడు చిన్నతనమునాటి నుండియు వెర్రివానివలె నుండుటచేత వా డెవరికిని ప్రియుడు గాక పోయెను. ఇట్లు తన కుమారునిజూచి యందరసహ్యపడుదురనియు, దన సవతికుమారుని నందరు ప్రేమించెదరనియు జూచి, యటులనే కొన్నిరోజులు జరగనిచ్చినయెడల దనకుమారుని వెడలగొట్టి జగదేవుడే రాజగుననియు వాఘేలిరాణి తలంచెను. జగదేవుడు తన సవతితల్లియగు వాఘేలిరాణిని సదా సంతోష పెట్టవలయుననియు, తనపయినామె పుత్రవాత్సల్యము నుంచవలయుననియు, నెల్లప్పుడు ఆమె యంత:పురమునకు బోయి యామె కరుణను బడయుటకు బ్రయత్నించు చుండెను. ఇట్లు తన యంత:పురమునకు శుద్ధాంత:కరణముతో బలుమారు వచ్చెడి బాలునిపై గొప్ప నెపమొకటి మోపి, రాజునకు నమ్మిక పుట్టునటుల జేసి, వాఘేలి యా జగదేవుని రాజ్యము వెడలగొట్టించెను. అప్పుడా కుమారుడు ఒక గుర్రమును, తన యాయుధములను మాత్రము వెంటబుచ్చుకొని, పట్టణమను స్వతంత్ర సంస్థానమునకు వెళ్ళి, యచ్చటి రాజువద్ద నేదియైన నధికారము సంపాదించుకొనవలయునన్న యుద్దేశముతో నా