పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సమయమున నతనిని నలుగురు దొంగలు పట్టుకొని పోయిరనియు జెప్పిరి. ఆమాటలు వినినతోడనే వీరమతియు, నామె చెలికత్తెయు దొంగలు పోయినత్రోవనే రాజపుత్రుని విడిపించుటకై గుర్రములను పరుగెత్తించిరి. కొంతదూరము పోయిన తరువాత నొక యరణ్యములో నాశూర స్త్రీలు, కాలుచేతులు కట్టబడియున్న జగదేవుని నడుమ బెట్టుకొని యతనిని జంపవలెనా వలదా యని తమలో దాము వాదించుకొనుచుండిన చోరచతుష్టయమును గాంచిరి. పురుష వేషధారులగు వీరిద్దరిని జూచి దొంగలు వారివద్ద ధనము దీసికొనవలెనన్న యిచ్ఛచే వారి మీదికి వచ్చిరి; కాని వీరమతియు నామె సహచరియు భీతినొందక వారిపై తమ కంక పత్రములను, భల్లెములను బ్రయోగింప సాగిరి. ఆ దుష్టులు చేయగలిగిన ప్రయత్నముల జేసిరి గాని, వారిలో నొకడు వీరమతిచే జచ్చెను; మరియొకడు చెలికత్తె యొక్క భల్లెప్రహరణమువలన దొడ తెగి క్రింద గూలెను. వీరమతిని జూచి మిగిలిన యిద్దరును పారి పోయిరి. అప్పుడు వీరమతి జగదేవుని బంధనములు విప్పి, యతడు తన పెనిమిటి యని తెలిసికొని, తానెవరో చెప్పక యతనిని గ్రామమునకు రమ్మని బలవంతము చేసి, వెంట దీసికొనిపోయెను. అచ్చటికి వెళ్ళిన తరువాత నిజస్వరూపము జూపగా, తన ప్రాణములు రక్షించినది తన యర్ధాంగియే యని తెలిసికొని, జగదేవు డత్యంతసంతోష చిత్తు డయ్యెను. అప్పుడు వీరమతి "మాకు దెలియపరుపక యిటుల నొక్కరు వచ్చుటకు గారణం బేమి" యని భర్తను అడిగెను. అందుపై నతడు తన వృత్తాంతమంతయు జెప్పి "నన్నుగొని