పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బహు పత్నీత్వదోష మీ దేశమునందు బహుకాలమునుండి, శిష్టాచారముగా నడుచుచున్నందున, ననేక కుటుంబముల గృహసౌఖ్యము నాశన మగుచున్నదని సకల జనులకు దెలిసినవిషయమే. ఒక స్త్రీని వివాహమాడి, యామె తన సహధర్మచారిణి యనియు, అర్ధాంగియనియు, 'నాతిచరామి' యని వివాహము నందు నామెకు వచన మిచ్చితిననియు మరచి, రెండవ భార్యను వివాహమాడి, మొదటి భార్యయందలి ప్రేమను విభజించుట గొప్ప అన్యాయమని చెప్పవలెనా ? ఏక పతి వ్రతమును, ఏక పత్నీ వ్రతమును, ఉత్తమ నాగరికతా ద్యోతకములని పెద్దలు చెప్పెదరు. మన సమాజములో స్త్రీలయెడ జరగెడి అన్యాయంబులలో బహుపత్నీ కత్వ మొక గొప్ప యన్యాయము. 'సవతిపోరు స్వర్గమునందయిన నక్కర లేద'న్న సామెతవలననే యీ బహుపత్నీత్వమువలన సమాజమునందు గలిగెడి కల్లోలములు వ్యక్తము కాగలవు. కావున కుటుంబ దు:ఖమునకు గారణమయిన యీ బహు పత్నీకత్వమును మాన్పి, యనాదికాలము నుండి యీ దేశమున నడుచుచున్న యేకపతివ్రతమువలెనే యేక పత్నీ వ్రతమును దేశాభిమానులు స్థాపించెదరని నమ్ముచున్నాను.

ఉదయాదిత్య మహారాజు వాఘేలిరాణియందు బద్ధానురాగుడయి, సోళంకిరాణిని దాసివలె జూచుచుండెను. కొంత కాలమునకు సవతిమత్సర మధికమయి వాఘేలిరాణి సోళంకిరాణిని ఇల్లు వెడలగొట్టించెను. కాని, మంత్ర్యాదులు మధ్యస్థులయి, సోళంకిరాణి యొక్కయు, నామె కుమారునియొక్కయు