పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చ్చటి రాజపుత్రుల లక్షణము లరసి వారి పటములను తెండని చెప్పెను. విప్రు లాప్రకారమే దేశదేశములకు వెళ్లి యనేక రాజపుత్రుల స్వరూపపటములను దెచ్చి వీరమతికిజూపి, యా యా రాజపుత్రుల స్వభావగుణములను నోటితో వర్ణనచేసిరి. వారిలో, ధారానగరములో రాజ్యము చేయుచున్న ఉదయాదిత్య మహారాజుగారి కుమారుడగు జగదేవు డను రాజపుత్రుని సద్గుణములను వినియు, నతని సుందరరూపమును జూచియు దానాతని దప్ప మరియొకరిని వరింపనని వీరమతి నిశ్చయించు కొనెను! ఈ సంగతి యామె యన్నగారికి దెలుపగా నతడు 'నాచెల్లెలగు వీరమతిని మీ కుమారుడగు జగదేవున కిచ్చెద' నని ఉదయాదిత్యునకు శుభ లేఖ పంపెను.

ఉదయాదిత్యుడు సూర్యవంశపురాజు, విక్రమాదిత్యుని వంశములోని 48 వ పురుషుడు. ఈయన మాలవదేశములోని ధారానగరమును తన రాజథానిగా జేసికొని యనేక సామంతులకు జక్రవర్తిగానుండెను. చావడావంశస్థు డగు బిరజ రాజతనికి సామంతుడుగానే యుండెను. ఉదయాదిత్యు డత్యంత శౌర్యవంతుడని ప్రఖ్యాతిని జెందినవాడు. ఇతని భార్యలిద్దరుండిరి. ఈ రాణీల నామములు తెలియకపోయినను పెద్ద భార్య వాఘేలీవంశములోని దనియును, రెండవభార్య సోళంక వంశములోని దనియును దెలియచున్నది. వాఘేలీ రాణికి రణధవలు డనియు, సోళంకీరాణికి జగదేవుడనియు బుత్రులు గలిగిరి.

వాఘేలీ, సోళంకీ రాణులు సవతులయినందున నొండొరు లొండొరులపయి నత్యంత మత్సరముతో బ్రవర్తించుచుండిరి.