పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సులీబా పండిత

ఈమె కాశికి సమీపమునందున్న రామనగర నివాసియగు కృష్ణవర్మయను బ్రాహ్మణుని కూతురు. ఈ కృష్ణవర్మ గొప్ప విద్వాంసుడు. ఆయన తన కూతురగు సులీబాకు విశేషవిద్య నేర్పి వేదాంతము, జ్యోతిషము, వేదములు, స్మృతులు, పురాణములు మొదలైనవన్నియు జెప్పి గొప్ప విద్వాంసురాలిని జేసెను. ఈమె దుర్బలయైనను నామెమనసు దుర్బలముగాక నీతి, ధర్మ, పాతివ్రత్యములను గలిగి సబలమై యుండెను. సులీబా వివాహయోగ్య కాగా నామె తండ్రి యాయూరనే యుండు జగన్నాథశాస్త్రియను నతని కామె నిచ్చి వివాహముచేసెను. జగన్నాథశాస్త్రియు విద్వాంసుడే గాన నా దంపతులు పరస్పరానురాగము కలిగియుండిరి. సులీబా పాతివ్రత్య ధర్మములను దప్పక నడుపుచుండెను. అందువలన నామెభర్త యామెపై నధికప్రేమ గలవాడయి యుండెను. ఆ గ్రామమునందామె యొక సంస్కృతపాఠశాలను స్థాపించి కన్యలకును వితంతువులకును మిగుల శ్రద్ధతో విద్య నేర్పుచు వారికి ధర్మశాస్త్రములను నేర్పి వానియందు జెప్పబడిన ధర్మములను వారి మనసులకు నాటునట్లు చేయుచుండెను. ఈమె తత్వదర్శనమను గ్రంథము నొకదానిని రచియించెను. ఈగ్రంథములో ధర్మ, నీతి, వేదాంతములను గూర్చి చెప్పబడియున్నది.