పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాలయి పురుషులవలెనే క్షౌరము చేయించుకొని తల వెనుక జుట్టుమాత్ర ముంచుకొనెను. ఆమె పురుషవస్త్రములనే ధరియింపుచుండెను. రూపమంజరి జన్మమంతయు నవివాహితగా నుండి తాను విద్యాభ్యాసము చేయుచు ననేకులకు విద్యాదానము చేయుచుండెను. ఆమె వద్ద నెల్లప్పుడు వ్యాకరణము కావ్యములు నేర్చుకొనుచు విద్యార్థు లనేకు లుండుచుండిరి. మానక గ్రామవాసియగు కవినాథ బోలానాథు డనునాత డీమె యొద్ద వైద్యశాస్త్రము నభ్యసించి గొప్ప ప్రవీణుడయ్యెను. రూపమంజరికి వ్యాపారులయొక్కయు, సంసారులయొక్కయు లెక్కలు బాగుగా దెలియుచుండెను. వైద్యమునం దామె కపార పాండిత్యము కలిగియుండెను గాన నామె దాని వలననే జీవనమునకు మూలమగు ధనమును సంపాదించుచుండెను. సాధారణలోకులీమెను విద్యాలంకారయనియు, తర్కాలంకారయనియు బిలుచుచుండిరి. ఈమె 90 సంవత్సరముల ముసలిదయి సర్వ తీర్థములను సేవించుకొని స్వగ్రామమునకు వచ్చి కొన్ని సంవత్సరములు జీవించి 102 సంవత్సరముల ప్రాయమున క్రీ.శ. 1875 వ సంవత్సరమున గతించెను.


________