పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కళాకౌశలములు జీవించుటయు గలుగును. ఎల్లవారును యుక్తమయిన దానిని జేయవలసినదే. ప్రతి మనుష్యుడును తన సహజీవులకు జేతనయినంత యుపకారముజేయ బద్దుడయి యున్నాడు. నరులయి పుట్టినవారెల్ల నితరులవలన దమకు గలిగిన యుపకారమునకు బ్రత్యుపకారముచేసి ఋణవిముక్తతను బొందవలసినది. పరసీమలో మనకు దిక్కెవ్వరని యడిగెదరా? ఏతద్విషయమయి గోల్డుస్మిత్తను ఇంగ్లీషుకవి చేసిన మహోపదేశమును మనము గమనింతము. అది యెద్దియనగా "అంధుల బుద్ధువిశేషము ననుసరింప నేర్చుకొనుము. ఏల యనగా వారెన్నడు తమచేతి యూతకోలతో భూమిని దడవి తెలిసికొనకుండ నడుగుపెట్టరు." ఆ తీరుననే నేను సర్వశక్తి సంపన్నుడయిన నా పరమపితను నాకూతకోలగా జేసికొని యెదను. ఆయనయే నా మార్గమును బరిశీలించి నన్ను ముందునకు నడిపించుకొనిపోవును. దానికంటెను మహోత్తరమయిన చేతియూత నాకన్య మేమియు గనబడదు.

కొట్టకొనకు నాజాతివా రెవ్వరును జేయనిపని నేనేల చేయవలెను? అనుదానికి నే విన్నవించున దేమనగా మన మొక్కరొక్కరము సంఘమునకు జెల్లింపవలసిన ఋణములు పెక్కులుగలవు. వీరీపని చేసిన ఋణవిముక్తత కలుగునని వేర్వేరుగ వక్కాణించుట దుస్తరము. ఒక్క కార్యముచే నొక్కరి కెప్పుడు మేలుగలుగగలదో యందువలన నందరికి మేలు కలుగుననియే యెంచవలసినది. సర్వత్రజనులందరికి శ్రేయస్కరమని చెప్పదగిన పనిని జేయుటకు మనలో నెల్ల