పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారును ప్రయత్నపడవలసినది. మనుస్మృతియందు "చేయదగిన ధర్మమును జేయక యుపేక్షించువారు క్షమియింపబడ గూడని మహాపాతకులు" అని చెప్పబడియున్నది. కావున నాతోడి స్త్రీలెవ్వరును నిదివరకు చేయనిపని నేనును జేయ గూడదనుట యాశ్చర్య జనకముగానున్నది. మృతజీవులని ప్రసిద్ధిగాంచిన మన పూర్వులకిట్టి యూహ లెన్నడును బుట్టి యుండలేదు. ఏదీ నా క్రైస్తవమిత్రులు నేనడుగబోవు నీక్రింది ప్రశ్నమున కేమి యుత్తరమునిత్తురో చూచెదము. ఓ నెచ్చలు లారా! మా మతధర్మములనుబట్టి యేసుక్రీస్తు మీ యందరి కొరకు తమప్రాణమును బలి యొసంగక యుండిన మీకు పాపవిమోచనము గలుగునని తలంతురా! ఆయన యట్లు లోకోపకారమును జేయుచుండగా వారికి గలిగిన ఘోరమయిన దండనమున కేమయిన నామహానుభావుడు జంకెనా? లేదు. ఆయన జంకినట్టు మీరెప్పుడొప్పు కొనునట్టివారుకారని నిశ్చయముగా నేను జెప్పగలను. మాపూర్వపు రాజులలోనుగూడ శిబిమయూరధ్వజుడు మొదలగువారు పరోపకారార్థమయి ప్రాణత్యాగము చేయ వెరవరయిరి. మనకు విఘ్నమే కలుగునో, యాపదలే సంభవించునో యని చేయవలసిన ధర్మమును జేయకపోవుట న్యాయముకాదు. మనము చేయవలసినంత ప్రయత్నము చేసి తీరవలయును. మన కటుపిమ్మట జయమయినను సరే, యపజయ మయిననుసరే. మనుజులను మూడు తరగతుల వారినిగా విభజించెను. అందు అధములు విఘ్నములు గలుగుననెడి భయమువలన నేపనినిగాని పూనుకొననివారు. మధ్యములు