పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డాక్టర్ ఆనందీబాయి జోశి

 
        స్త్రీవిద్యా విజయదుందుభి!!!
గీ. తనసిరే వేల్పు లుదధిరత్నములచేత
   వెరచిరే ఘోర కాకోలవిషముచేత
   విడిచిరే యత్న మమృతంబు వొడము దనుక
   నిశ్చితార్థంబు వదలరు నిపుణమతులు

ఇయ్యుత్తమకాంత క్రీ.శ. 1865 వ సంవత్సరము మార్చినెల 31 వ తేదీన పూనాపట్టణమునందు జన్మించెను. ఈమె తండ్రిపేరు గణపతిరావ్ అమృతేశ్వర్ జోశి. ఈయన పూర్వు లార్జించిన యగ్రహారములోని ధనమువలన జీవింపుచుండెను. వీరి నివాసస్థలము కల్యాణపట్టణము. ఆయన భార్య పూనాకు బుట్టినింటికి నీళ్ళాడబోయెను. కాన ఆనందీబాయి యచటనే జన్మించెను. మన దేశమునందలి యాచారమువలన నాడుబిడ్డ పుట్టుటవలన దలిదండ్రుల కేమి, బంధువుల కేమి మిగుల వ్యసనము కలుగును. అదే ప్రకార మీమె జననీజనకులును విచారపడిరి. అప్పుడీ బిడ్డవలన దామును బ్రసిద్ధుల మగుదమని వారి కేమి తెలియును? దేశాచారప్రకారము పదునొకండు దినములు గడచిన వెనుక పండ్రెండవదినమున బారసాల చేసి పిల్లకు యమున యని నామకరణము చేసిరి. శిశువునకు మూడునెలలు వెళ్లగానే, తల్లి కల్యాణమునకు వెళ్లెను. యమున క్రమక్రమముగా, బాలలీలలను జేయుచు దల్లిదండ్రుల నానందసాగరమున ముంచుచుండెను. ఈమె నాలుగైదు సంవత్సరముల