పుట:Abaddhala veta revised.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారు, యీ చర్య జరిగినచోట ప్రథమచికిత్స కిట్స్ యిస్తున్నారు. అమెరికాలోని ముస్లింలు సైతం విదేశాలకు వెళ్లి తమ ఆడపిల్లలకు సుంతీ చేయించుకొస్తున్నారు. అమెరికాలో ఆడపిల్లల సుంతీ నిషిద్ధం గనుక అలా చేస్తున్నారు.

ప్రపంచ మతాల సభను సమితి ఏర్పాటు చేసింది. పిల్లల విషయంలో జాగ్రత్త వహిస్తామని ఆయా మత ప్రతినిధులు అన్నారు. కాని మూల పవిత్రగ్రంథాలను ప్రశ్నించకుండా, మత మూల పురుషుల పెత్తనం తొలగించకుండా వున్నంత కాలం, పిల్లలపై అత్యాచారాలు, దూషణలు ఆపడం సాధ్యంకాదు. మతాలే పిల్లల హక్కుల్ని అమలుపరచనివ్వడం లేదు. మత గ్రంధాలలో పిల్లల్ని హింసించడాన్ని ఆమోదించారు. పిల్లల్ని బానిసలుగా చూడడాన్ని బైబిల్ ఆమోదించింది. అలాంటి మతాలు పిల్లల హక్కుల్ని అమలుపరచవు.

పిల్లల్ని ఎవరు ఎన్ని విధాలు చిత్రహింసలకు గురి చేస్తున్నారనేది ఏకరవు పెడితే చాలా పెద్ద జాబితా అవుతుంది. ఏ మతం ఏ విధంగా పిల్లల్ని దారుణంగా అణచివేస్తున్నదీ పెద్ద జాబితాలోకి వస్తుంది. సమితి, యీ విషయం జాగ్రత్తగా గ్రహించి, హక్కుల పత్రం తయారుచేసింది. వీటిని ఆమోదించిన దేశాలు, తమ ప్రాంతంలో మతాల్ని జాగ్రత్తగా అదుపులో పెట్టి, పిల్లల్ని కాపాడాలి.

పుట్టిన పిల్లలందరూ పెరుగుతారు. ఎలా పెరుగుతున్నారనేది సమస్య. అక్కడే వారి హక్కుల ప్రస్తావన వస్తుంది. ఇందుకుగాను తల్లిదండ్రులకు చాలా చెప్పవలసి వుంది. పిల్లలహక్కులు అనేది చాలా మందికి వింతగా, కొత్తగా, ఆశ్చర్యంగా కనిపించవచ్చు. క్రమేణా, లోతుకు పోయే కొద్దీ అందులో శాస్త్రీయ సత్యం వుందని గ్రహిస్తారు. కొట్టి నోరు మూయించడం సులభం, నచ్చజెప్పడం, సందేహాలు తీర్చడం, ఓపెన్ గా జవాబులివ్వడం, విసుక్కోకుండా సమాధానాలివ్వడం దుర్లభం.

ముఖ్యంగా పిల్లలకు అబద్ధాలు చెప్పకూడదు. తల్లిదండ్రులు చాల సందర్భాలలో, క్రమశిక్షణ పేరిట, భయం పుట్టించే విషయాలు చెబుతారు. దేవుడికి దండం పెట్టకపోతే శిక్షలు పడతాయనీ, నరకానికి పోతారనీ, చీకట్లో రాక్షసులు, దయ్యాలు, భూతాలూ వస్తాయనీ యిలాంటి వన్నీ తాత్కాలికంగా తల్లిదండ్రులకు ఉపకరించవచ్చు. కాని పిల్లలకు శాశ్వత హాని చేకూర్చుతాయి. దైవాన్ని గురించి పిల్లలు వేసే ప్రశ్నలకు చాలామంది తల్లిదండ్రులు తెలిసో తెలియాకో ఆగ్రహిస్తారు, కొడతారు. అదే వారు చేస్తున్న పెద్ద తప్పు. అలాగే పిల్లలు తమ పుట్టుక గురించి అడిగినప్పుడు కూడా దేవుడు పుట్టించాడనీ, చనిపోయినప్పుడు దేవుడు దగ్గరకు వెళ్ళారనీ చెప్పి, అన్వేషణ చంపేస్తున్నారు. తల్లి దండ్రులకు యీ విషయమై చాలా చెప్పవలసివుంది. అక్కడే పిల్లల హక్కుల సమస్య వస్తుంది. ఇది ఒక విధంగా చిక్కులతో కూడినదైనా, తప్పనిసరిగా పరిష్కరించాలి.

పిల్లల హక్కులు గమనించనందున అనేక దారుణాలు జరిగిపోతున్నాయి. ప్రతి సంవత్సరం, సమితి అంచనా ప్రకారం ఒక కోటి ఇరవై ఐదు లక్షల మంది పిల్లలు చనిపోతున్నారు.