పుట:Abaddhala veta revised.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్న పిల్లల్ని వివిధ పనులకు వినియోగించడం మరొక చర్యగా వుంది. బడిలో చదవాల్సిన వయస్సులో పని చేయించి, వారి సంపాదన తల్లిదండ్రులు స్వీకరిస్తున్నారు. చిన్న పిల్లల్ని పరిశ్రమల్లో వినియోగించినప్పుడు, ఆ కర్మాగారాల ఉత్పత్తి స్వీకరించకూడదని కొన్ని ప్రజాస్వామిక దేశాలు ఆంక్షలు పెడుతున్నాయి. ఉదాహరణకు భారతదేశంలో చిన్న పిల్లల్ని తివాచీలు తయారుచేయడంలో, బాణాసంచా మందు సామాగ్రి చేయడంలో, బీడీలు తయారుచేయడంలో వినియోగిస్తున్నారు. పిల్లల్ని తమ పెట్టుబడిగా వాడుకోవడం తల్లిదండ్రుల నేరం, కనడం అదుపులో పెట్టుకోమంటే, దేవుడిచ్చిన సంతానం అని సమాధానం సాకుగా చెబుతారు. అక్కడ కూడా మతాలూ అడ్డొచ్చి, జనాభా అదుపును వ్యతిరేకిస్తూ, దైవం పేరిట, పవిత్ర గ్రంధాలపేరిట ద్రోహం చేస్తున్నాయి. కాలుష్యం పెంచడంలో మతాల పాత్ర చాలా వుంది. ఈ విషయంలోనూ తల్లిదండ్రులకు నచ్చజెప్పాల్సిందెంతో వుంది.

యుద్ధాలలో చిన్నపిల్లల్ని వాడడం మరో ఘోరచర్య. ఆఫ్ఘనిస్తాన్ మొదలు సొమాలియా వరకూ యుద్ధాలలో చిన్నపిల్లల్ని వాడారు. ఇంకా వాడుతున్నారు. మతం, దైవం పేరిట పిల్లలు సైతం దేశం కోసం, నాయకుడి కోసం త్యాగం చేయాలని బోధలు చేసారు. అనేక మంది పిల్లల్ని ఆహుతి చేసారు. ఈ విషయంలో ఏయే దేశాలలో ఎంతమంది పిల్లలు బలి అయిందీ సమితి వివరాలు ప్రచురించింది. అనేక చోట్ల మందుపాతర్లకు వికలాంగులుగావడం, చనిపోవడం కూడా నిరంతరం జరుగుతున్నది. మందు పాతర్లని తొలగించాలని తీర్మానించినా, ఈ ఉద్యమం కుంటుతూనే వుంది.

పిల్లలకు సైతం మతం పేరిట వైద్యం చేయకుండా, కేవలం ప్రార్ధనతో చికిత్స సరిపోతుందనే నేరాలకు కొందరు పాల్పడుతున్నారు. క్రైస్తవ మతశాఖలు కనీసం 15 వరకూ యీ క్రూర చర్యను అమలుపరుస్తున్నాయి. దీనిపై అమెరికా, యూరప్ దేశాలలో వుద్యమాలు సాగుతున్నాయి. మతహక్కు చాటున, పిల్లల రోగాలు వచ్చినట్లు చెప్పకుండా దాచిపెట్టి, చంపేసిన దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. క్రిస్టియన్ సైన్స్, ఫెయిత్ అసెంబ్లీ, జెహోవా విట్నెస్, క్రీస్తు అసెంబ్లీ వంటి క్రైస్తవ శాఖలు యిలాంటి చర్యలకు పాల్పడుతున్నాయి. లోగడ భారతదేశంలో చిన్నపిల్లలకు రోగాలు వస్తే, మొక్కుకోవడం, కాల్చడం వంటి పిచ్చి వైద్యాలు చేసి ఆహుతి యిచ్చినట్లే, యివి కూడా సాగుతున్నాయి. ఇలాంటివి అన్ని మతాలలోను వున్నాయి. మదర్ తెరీసా వంటి వారు చిన్నపిల్లలకు మందులివ్వకుండా ప్రార్ధనలతో సరిపెట్టిన సందర్భాలున్నాయి!

మతం పేరిట ప్రపంచ వ్యాప్తంగా మరో ఘోరం జరుగుతున్నట్లు సమితి ఇటీవల గుర్తించింది. మతం పేరు పెట్టకుండా సాంస్కృతిక దురాచారం అన్నారు. ఆడ పిల్లలకు సుంతీ చేయించడం యిందులో ఒకటి. కొన్ని ముస్లిం దేశాలు, కొన్ని ఆఫ్రికన్ దేశాలు యీ చర్య తప్పనిసరిగా చేస్తున్నాయి. బాలికల మర్మాంగం బుడుపును కోసేస్తారు. దీనివలన వాపులు, సెప్టిక్ అయి చనిపోవడం, సెక్స్ చర్యలో తీవ్ర ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయి. యునెస్కో