పుట:Abaddhala veta revised.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శరణ్యం అన్నారు. కాని మతం అంటరానితనాన్ని పోగొట్టలేదని మరొకమారు రుజువయింది. మాట అసహనం కారణంగా రాజకీయోద్యమంలో మానవతకు తావు లేకుండా పోయి, దేశవిభజన జరిగి, ఊచకోత కోసుకున్నారు.

స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో మనుషులందరినీ ఒకే తీరుగా చూడటానికి వీలైన తరుణంలో అధికారంలో ఉన్న నేహ్రూ దేశమంతటికీ యూనిఫారమ్ సివిల్ కోడ్ పెట్టలేకపోయారు. అంతటితో రాధాకృష్ణ సెక్యులరిజానికి విపరీత వాఖ్యానాలు చేసి మతానికి అధికారముద్ర సంపాదించగలిగారు. అన్ని మతాలూ సమానమనే పేరిట ప్రభుత్వం మతాలన్నిటినీ ప్రోత్సహిస్తూ ఓట్ల కోసం మత సంస్కృతిని కట్టుదిట్టం చేస్తూ వచ్చింది.

20వ శతాబ్దంలో భారతదేశానికి పునర్వికాసం కావాలనీ, గతాన్ని హేతుబద్ధంగా పరిశీలించి అవసరమైన మేరకే స్వీకరించాలనీ మానవతావాదులు కోరారు. ఎం.ఎన్.రాయ్ నాయకత్వంలో ఈ మానవతావాదుల ప్రభావం అల్పంగానే మిగిలిపోయింది. శాస్త్రీయ పద్ధతిలో సెక్యులరిజం తీసుకురావాలని ప్రయత్నించిన ఎ.బి.షా., సత్యశోధన మండల్ ప్రభావం కూడా అట్టేలేదని చెప్పవచ్చు. విజ్ఞానం, సాంకేతికం, విపరీత వేగంతో ప్రపంచంలో ముందుకు పోతుండగా మనదేశంలో వాటిని మాట అభివృద్ధికి వినియోగించుకుంటున్నారు. రాజకీయాలు ఈ విషయం తెలిసికూడా ఉదాసీనత వహిస్తున్నాయి. ప్రజలలో మానవతావాదాన్ని ప్రచారం చేయటానికి విద్యారంగం, టి.వి. రేడియో వంటి శక్తివంతమైన సాధనాలు ప్రభుత్వం చేతిలో ఉండి కూడా ఉపయోగించుకోలేక పోతున్నారు. శాస్త్రీయాభివృద్ధిని వెనక్కు తిప్పలేమని బ్రోనోస్కీ అన్నాడు. అది నిజమే కావచ్చు. అందుకు తగిన వైజ్ఞానిక మనస్తత్వం అభివృద్ధి కాకుండా మన పాలకులు తాత్కాలికంగా ఆపగలిగారు. మనం వెనుకబడి ఉండటానికి ఈ శాస్త్రీయ దృక్పధాన్ని మానవతా దృ క్పధాన్నీ అలవరచుకోపోవడమే కారణం.

మానావతావాదానికి మైనారిటీ తీరినప్పుడే భారతదేశం ప్రపంచంలోని అగ్రస్థాయి దేశాలతో దీటుగా పురోగమించగలదు. ఇందుకు చాలా కృషి అవసరం.

- హేతువాది, జూలై 1987
హేతువాదుల కార్యరంగం

మనకు బ్రతికున్న దేవుళ్ళు, చనిపోయిన దేవుళ్ళు అని స్థూలంగా రెండు రకాలున్నరు. తిరుపతి వెంకటేశ్వరుడు, జీసస్ క్రైస్తు, మహమ్మదు మొదలైనవారంతా చనిపోయిన బాపతు. రెండవ వర్గంలో సాయిబాబా, రజనీష్, శివబాలయోగి, జిల్లెళ్ళమూడి అమ్మ యిత్యాదు లున్నారు. ఇంకా కొత్త దేవుళ్ళు వెలుస్తూనే వున్నారు. మనుషులు కొలుస్తూనే వున్నారు. మానవుడి దృష్టి అనంతం అనడానికి యిది కూడా ఒక నిదర్శనమే.