పుట:Abaddhala veta revised.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజకీయ పార్టీలకు డబ్బు ఎంత యిచ్చినా, వారెంత వసూలు చేసినా దానికి చిట్టా, ఆవర్జా లేదు. ఆదాయపు పన్నులేదు. అడిగేవాడు లేడు. అలాగే మతానికీ, దేవాలయానికి, మసీదుకూ యిచ్చిన డబ్బుకు లెక్కలు లేవు.

కనుక దొంగడబ్బు సంపాదించాలన్నా, ఖర్చు పెట్టాలన్నా-రాజకీయ పార్టీ కావలి. లేదా గుడి, మతం, మఠం కావలి. ఇంకెక్కడన్నా అయితే పట్టుబడే అవకాశం వుంది. అప్పుడు కోర్టు, కేసు, పోలీసు, జైలు యిలాంటివి ఎన్నో రంగంలో ప్రవేశిస్తాయి. ఆదాయపు పన్నువారు, ఎక్సైజ్ శాఖవారు, పోలీసులు, రాజకీయాల్లోవారు 'మహాభక్తులు' గనుక మతం జోలికి పోరు.

ఆంధ్రప్రదేశ్ లో ఉదాహరణకు చూడండి : జిల్లావారీగా ఎందరు బాబాలు, మహాత్ములు, యోగులు, సన్యాసులు, మాతలు, అమ్మలు, దేవీ అవతారాలు వున్నారో లెక్కలు తెలియదు. మన రాష్ట్రంలో భిక్షగాళ్ళ వృత్తిపై నిషేధం వుంది. అమలు జరగని చట్టాలలో అదొకటి. కనీసం అలాంటిదైన యీ 'వర్గానికి' లేదు. కనుక వారు యధేచ్ఛగా తెగబడి, సంఘం మీద విరుచుకుపడి దోస్తున్నారు.

ఇటీవల వీరిలో కొందరు రాజకీయాల్లో ప్రవేశిస్తున్నారు. రాజమండ్రిలో రామలింగ సిద్ధాంతి కోసం సాక్షాత్తు ప్రస్తుత రాష్ట్రపతి అలనాడు హోమ్ మంత్రిగా ప్రత్యేక విమానంలో వచ్చారు. ఇక సాయిబాబా సంగతి చెప్పనక్కరలేదు. కొందరు చిట్ ఫండ్స్ వాళ్ళు డబ్బులు కాజేసి పారిపోయినట్లే, ఆశ్రమాలు పెట్టినవారు వున్నట్లే మాయం అవుతున్నారు. పూనాలో రజనీష్ అలాగే అమెరికాలో తేలాడు.

ఇదంతా ఎందుకు జరుగుతున్నది? ప్రభుత్వం అనుసరించే 'బూటకపు సెక్యులరిజం' వలన, అన్నిమతాలనూ సమానంగా చూడాలి అనే నెపంతో, అధికారంలో వున్నవారు ఎవరికిష్టమైన దానిని వారు భుజాన వేసుకొని మోస్తున్నారు. ముఖ్యమంత్రిగా అంజయ్య ఒక శంకరాచార్యుల మఠంలో గోపురానికి డబ్బు దానం చేశాడు. ముఖ్యమంత్రి కాబోయేవ్యక్తీ అయినవాడూ-అందరు తిరుపతి, యాదగిరి, అన్నవరం, సింహాచలం, మంత్రాలయం ప్రభుత్వ ఖర్చుపై వెళ్లి మొక్కుబడులు తీర్చుక వస్తుంటారు. వీరంతా ఎంత భక్తులంటే, ప్రార్థనలు చేయమని ఆదేశాలిస్తారు. యజ్ఞాలు చేయిస్తారు!!

దోపిడీ విపరీతంగా చేస్తే, మామూలు రాతికి బదులు పాలరాతితో గుడులు కట్టిస్తారు. హైదరాబాద్ లో బిర్లామందిర్ యిందుకు ఉదాహరణ. అయ్యప్ప భక్తులైతే పాపం చేసినట్లు ఒప్పుకొని ప్రాయశ్చిత్తం కోసం వేరే దుస్తులు వేసుకొని, కొన్నాళ్ళు కష్టిస్తారు. క్రైస్తవులు తమ పాపాలను ఫాదరీలకు చెప్పుకున్నట్లే వీరు అయ్యప్పను శరణు వేడతారు.

ఈ విధంగా భక్తి రోజురోజుకూ ముదిరి, అనేక విధాల వెల్లడై అప్పుడప్పుడు, ఆవేశం పట్టజాలక మతకలహంగా పరిణమిస్తుంటుంది. మసీదు పక్కగా, వూరేగింపు వాయిద్యంతో