పుట:Abaddhala veta revised.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిషు పాలకులూ, యూరోపుదేశాల వారూ ఇండియాకి వచ్చిన తరువాత క్రైస్తవుల ప్రభావం వ్యాపించింది. ఈ మతానికి పాపాత్ములూ, పేదవారూ కావాలి. అప్పుడే వారి ప్రచారానికి ఆకర్షణ ఉంటుంది. అలాంటి అవకాశం భారతదేశంలో బాగా కనిపించింది. క్రైస్తవ ఫాదరీలు తక్కువ కులాల వారినీ, ముఖ్యంగా అంటరానివారిని ఆకర్షించి అపరిమితంగా మతం మార్పిడి చేశారు. విచిత్రమేమంటే అటు ముస్లిములూ, ఇటు క్రైస్తవులు కూడా కులాన్ని పోగొట్టలేకపోగా క్రమంగా కులాలను పాటించారు. హిందూ ఆచారాలను కొన్నిటిని స్వీకరించారు. అందువలన నేడు హిందువుల్లోని కులాలు ముస్లిముల్లోనూ, క్రైస్తవుల్లోనూ కనిపిస్తున్నాయి. మానవుల హెచ్చుతగ్గులు మతపరంగా పోవని తేలిపోయింది.

18,19 శతాబ్దాలలో భారతదేశాన్ని మార్చటానికి మత సంస్కర్తలు మళ్ళీ ప్రయత్నించారు. అందులో భాగంగానే ఆర్యసమాజ్ పంజాబ్ లోనూ, బ్రహ్మసమాజ్ బెంగాల్లోనూ, ప్రార్థనాసమాజ్ మహారాష్ట్రలోనూ, దివ్యజ్ఞానమతం మద్రాసులోనూ, రామకృష్ణ వివేకానంద మిషన్ మొదలైనవన్నీ చూస్తాం. మతాన్ని మార్చటానికి వీరు చేసిన ప్రయత్నంలో కొన్ని దోషాలు తొలగించగలిగారు. హిందువులు పాటించే అమానుషమైన సతీసహగమనాన్ని బ్రిటిషువారి సహాయంతో నిషేధించగలిగారు. కాని మౌలికంగా మార్పులు తేవడం సాధ్యపడలేదు. అంటరానితనం జోలికి పోలేకపోయారు. కులాల హెచ్చుతగ్గులను కదిలించలేకపోయారు. వీటిని సమర్ధించే ధర్మశాస్త్రాలను, పురాణ ఇతిహాసాలను ఖండించలేకపోయారు. అలా ఖండించిన ఆర్యసమాజం పరిమితంగానే ఉండిపోయింది. చివరకు ఆదిమ ఆచారాలనూ, విగ్రహారాధన సైతం తొలగించలేకపోయారు.

బెంగాల్లో హెన్రీలూయీ వివియస్ డిరోజియో(1809-31) కలకత్తాలో హిందూ కాలేజీలో లెక్చరర్ గా ఉంటూ మతసంప్రదాయాలూ, దురాచారాలపై దాడిచేసి బెంగాల్ యువకులను ప్రోత్సహించి, హేతువాదాన్ని ప్రబోధించాడు. బహుశ అతడు ఎక్కువకాలం బ్రతికిఉన్నా కొంత ప్రభావం కనిపించేదేమొ- కాని హిందూ కాలేజీ అతణ్ణి ఉద్యోగం లోంచి తీసివేసిన సంవత్సరానికి కలరాతో చనిపోయారు. ఆ విధంగా బెంగాల్లో ప్రారంభమైన మానవతావాదం 19వ శతాబ్దంలో ఆగిపోయింది. మహారాష్ట్రలో పండితరమాబాయి, పూలే ప్రారంభించిన హేతువాదం కూడ మతప్రభావం ముందు నిలువలేకపోయింది.

20వ శతాబ్దంలో జాతీయోద్యమం ఉప్పెన వలె వచ్చింది. అరబిందో, తిలక్,గాంధీ జిన్నా వంటి వారి చేతుల్లో ఈ ఉద్యమం ప్రజలను బ్రిటిషువారికి వ్యతిరేకంగా చైతన్యవంతులను చేసింది. ప్రప్రథమంగా మతాన్ని రాజకీయాలలోకి తీసుకవచ్చారు.అందువలన మతంలో మంచిని వెతకటానికి ప్రయంత్నించారు. ఒక చేతిలో బైబిల్, మరొక చేతిలో భగవధ్గీత, ఖురాన్ పట్టుకున్న గాంధీ, ఈశ్వర్ అల్లా తేరేనాం అంటూ ప్రార్థనలు చేస్తే అటు హిందువులు గానీ, ఇటు ముస్లిములు గానీ ఒప్పుకోలేదు. అంటరానితనంపై గాంధీ చేసిన ఉద్యమానికి రాజకీయాలు తోడ్పడలేదు. గాంధీలో అగ్రవర్ణాల హిందువును చూచిన అంబేద్కర్ బౌద్ధం ఒక్కటే అంటరానివారికి