పుట:Abaddhala veta revised.pdf/85

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

అంటరానివారు అనే ఒక ప్రత్యేకమైన కులం కూడా మతం నుంచి పుట్టుకొచ్చింది. మనం ఈనాడు ఊరివెలుపల చూస్తున్న హరిజనులనేవారు మన ప్రాచీన ధర్మశాస్త్రాల, పవిత్రగ్రంథాల అగ్రవర్ణాల సృష్టి అని మరచిపోకూడదు. గ్రీకులు, రోమనులు తమ ప్రజాస్వామ్యాన్ని బానిసలకు విస్తరించకుండా, సంతలో పశువులవలె మనుషుల్ని అమ్మినట్లే, అంతకంటె నీచంగా తక్కువ కులాలవారినీ,అంటరానివారినీ చూచి బాధించి బానిసత్వాన్ని శాశ్వతం చేశారు. అక్కడే మానవతావాదం అడుగంటింది.

హిందూమతంలో హెచ్చుతగ్గులను కొంతవరకైనా వ్యతిరేకించిన బౌద్ధాన్ని శంకరుడు వచ్చి చంపేశాడు. ఆయన నిర్గుణ బ్రహ్మ సిద్ధాంతాన్నీ, అద్వైత వేదాంతాన్నీ ప్రబోధించినా వర్ణాశ్రమ ధర్మాలను మాత్రం కఠినంగా అమలుపరచాలన్నాడు. బ్రహ్మసూత్ర భాష్యంలో స్పష్టంగా వేదాన్ని వినే అధికారం శూద్రులకు లేదన్నాడు. ఉత్తరాదిలో వైష్ణవం, దక్షిణాదిలో శైవం వ్యాపించినప్పటికీ కులాన్ని మాత్రం ఎవరూ ఎదురుకోలేదు. శంకరుణ్ణి వ్యతిరేకించిన రామానుజాచార్యులు, వీరిద్దరినీ ఖండించిన మధ్వాచార్యులూ కులం జోలికి పోలేదు. ఆ తరువాత దేశంలో పెధ్దమార్పులు వచ్చాయి.

ముస్లిములు 10వ శతాబ్దం నుండి దేశంపై అనేక పర్యాయాలు దాడిచేసి దేవాలయాలను కొల్లగొట్టారు. దేవాలయాల జోలికిపోతే కళ్ళు పోతాయనీ మ్లేచ్చులు దైవాగ్రహానికి ఆహుతైపోతారనీ పురోహిత వర్గాలు చేసిన ప్రచారం అబద్దమని తేలిపోయింది. మనుషులు కట్టిన దేవాలయాలు, సృష్టించిన దేవుళ్లు చూస్తుండగానే ముస్లిముల ఆక్రమణకు గురయ్యారు. కొద్దిమంది విదేశాలనుండి దండయాత్ర చేసి ఇంతమంది హిందువులను జయించటానికి ఇక్కడవున్న కులాల చీలికలూ, మతం పేరిట కొట్లాటలూ, అమానుషమైన హెచ్చుతగ్గులూ కారణాలయ్యాయి. క్రమేణా తక్కువ కులాలలోని హిందువులు ముస్లిముల్లో చేరిపోయారు. ఇస్లాంలో కులాలు లేని మాట నిజమే. ప్రార్ధన సమయంలో అందరూ సమానమైన మాట నిజమే. కాని ఉత్తరోత్తరా ముస్లిముల్లో కూడా అంతస్తుబేధాలు, అనేక విధాలైన తారతమ్యాలు ఉన్నాయని బయటపడింది. దైవం పేరిట పాలకులూ, పురోహితవర్గాలూ ఇస్లాంలో మనుషుల్ని చిత్రహింస చేశారు. స్త్రీలను చిన్నచూపు చూశారు. ముస్లిములు కాని వారిని కాఫిర్లు అంటూ తక్కువగా చూచారు. మొత్తంమీద ముస్లింల దండయాత్ర వలన ఇండియాలో ఒక పెద్ద మైనారిటీవర్గం ఏర్పడి చరిత్రను మార్చివేసింది.

మధ్య యుగాలలో మతాన్ని మానవత్వంతో మార్చాలని అనేక మంది సంస్కర్తలు విఫల ప్రయత్నం చేశారు. బసవుడు కులాన్ని ఖండించాడు. కబీర్, నానక్, తుకారాం, జ్ఞానదేవ్, ఏక్ నాధ్, ధర్మానంద, చరణ్ దాస్, చైతన్య మొదలైన వారంతా గ్రామసీమల నుండి భక్తిప్రపత్తులతో పాటలు పాడుతూ జనాకర్షణ పద్ధతులు అవలంబించినప్పటికీ లోతుగా పాతుకుపోయిన కులాన్ని కదిలించలేకపోయారు. హెచ్చుతగ్గులను తొలగించలేకపోయారు.