పుట:Abaddhala veta revised.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మామూలుగా వున్నది. కాసేపువున్న తరువాత మళ్ళీ చూడమన్నారు. ఈసారి 104 డిగ్రీలతో ఒడలు మండిపోతున్నది. అయినా స్వామి చలించలేదు. ఇంతలో ఏంజరిగిందో తెలియని భక్తులు స్వామి మహత్తుకు అబ్బురపడి దండాలుపెట్టి నోరు మూసుకున్నారు.

డాక్టరు వస్తున్నప్పుడే సబ్బుముక్క చప్పరించి మింగిన స్వామి, కొద్దిగా తేనీరు సేవించారు. ఆ విషయం భక్తులకు తెలియదు. తీర్థం పుచ్చుకుంటున్నాడని భ్రమించారు.

కడుపులో సబ్బునందుగల క్షారం(ఆల్కలీ)తో తేనీటిలోని ఆమ్లం(యాసిడ్) మిళితం కాగా,రసాయనికమార్పు జరిగి వేడి పుడుతుంది. ఇది కృత్రిమంగా సృష్టించిన ఉష్ణోగ్రత. భక్తులు ఆశ్చర్యపడుతుండగా స్వామి ఏమీ పుచ్చుకోకుండా కేవలం చల్లనినీరు మాత్రమే తాగుతూ డాక్టరు ఇస్తామన్న మందులు, ఇంజక్షన్ పుచ్చుకోరు. చల్లని నీరు వలన కడుపులో మంట, ఉష్ణం తగ్గిపోతుంది. అదంతా దివ్యశక్తిగా భక్తులు భావిస్తారు.

గుడిశెలు తగులబడుతున్నాయి!

తెలంగాణా మారుమూల గ్రామం సింగారంలో ఒకనాడు మిట్టమధ్యాహ్నం వున్నట్లుండి ఒక గుడిశపై మంటలు చెలరేగాయి. మగవాళ్ళంతా కూలీకి పోయారు. మంటలు చూచిన ఆడవాళ్ళు గుండెలు బాదుకున్నారు. కష్టపడి నీళ్ళుపోసి ఆర్పేశారు.

మరునాడు ఇంకోగుడిసెపై అలాగే మంటలు లేచాయి. ఈ వార్త ప్రాకిపోయి, ఆ వూరికేదో శాపం తగిలిందన్నారు. జనం పొరుగూళ్ళనుండి వచ్చిచూచి, వింతకథలు అల్లారు. స్థానికపత్రికలలో కూడా వార్త వచ్చింది.

హేతువాదులకు యీ విషయం తెలిసి,వెళ్ళి పరిశీలించదలచారు. ప్రేమానంద్ అనే మాంత్రిక హేతువాదిని వెంటబెట్టుకొని ఆ వూరు చేరారు. జనం చెప్పిన కథలు ఆలకించారు.

ప్రేమానంద్ తగులబడిన గుడిసెలు పరిశీలించాడు. పిడకలు ఎండబెట్టిన గుడెశెలే తగులబడ్డాయి. పిడకలు లేని ఇళ్ళకు మంటలురాలేదు.

ఏం జరిగింది? పరిశీలించగా తేలిన సారాంశం

పిడకలు చేసేటప్పుడే పచ్చఫాస్ఫరస్ కలిపిపెట్టారు. పిడకలలో తడి ఆరగానే, పచ్చఫాస్ఫరస్ నుండి వేడివచ్చి, క్రమేణా గుడిసెపై పొగరావడం, తగులబడడం జరిగింది. కావాలని పచ్చఫాస్ఫరస్ కలిపి పెట్టారన్నమాట. ఎవరు పిడకలు చేశారో తెలుసుకుంటే దొంగ దొరికిపోతాడు. ఎందుకు అలా చేసిందీ ఆరా తీయవచ్చు.ఇది చేయకుండా నమ్మకాలతో వుంటే, ఇంకా జనాన్ని భయకంపితుల్ని గావించి, వ్యాపారం చేసుకునే వారుంటారు.