పుట:Abaddhala veta revised.pdf/77

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నీళ్ళు, ఆ కాళ్ళతో బాబా తెల్లని వస్త్రంపై నడిచారు. అంతకు ముందే పసుపు ద్రవంలో తడిపినవస్త్రం గనుక నిమ్మరసం తగలగానే కాలిముద్రలు ఎర్రగా పడ్డాయి. పసుపు, నిమ్మ కలిసినందున ఎర్రగా మారిందనేది అసలు రహస్యం. దీనిని పూనకంగా చూపి బాబా భ్రమింపచేశారు, ప్రేమానంద్ వివరణతో గుట్టు బట్టబయలైంది.

నాడి కొట్టుకోకుండా ఆపగలరా?

బ్రతికినంత కాలం నాడి కొట్టుకుంటుంది. నాడి ఆగడం అంటే చనిపోవడమే. కాని సిద్ధులు తమ తపస్సు వలన, శక్తిని సాధించి, నాడి ఆపగలరని ప్రచారంలో వుంది. భక్తులు యిది కళ్ళారా చూచినపుడు నమ్మక చేసేదేముంటుంది.

వూళ్ళోకి వచ్చిన స్వాములవారు ఇంకోరోజు డాక్టరును పిలుచుక రమ్మన్నారు. ఆవేళ ఏమి అద్భుతం జరుగుతుందోనని భక్తులు ఎదురుచూస్తుండగా, నాడి చూడమని స్వామివారు చెయ్యిచాచారు. డాక్టరు పరీక్షించి, సాధారణంగా నాడి ఆడుతున్నట్లు ప్రకటించారు.

స్వామీజీ యీ లోగా ఏవో మంత్రాలు చదివారు. సంస్కృతంలో వున్న ఆ మంత్రాలకు అర్థం తెలియక భక్తులు దండాలు పెట్టుకుంటున్నారు. మళ్ళీ నాడిచూడమని డాక్టర్ కు సైగ చేశారు. ఈసారి చూచిన డాక్టర్ నాడికొట్టుకోవడంలేదని చెప్పాడు. మళ్ళీ చూచారు. సెతస్కోప్ కు నాడీ శబ్దం అందలేదు.

భక్తులు సాష్టాంగపడ్డారు. ఇంకా కొందరు విరాళాలు గుప్పించారు.

హేతువాది ప్రేమానంద్ వచ్చి తానూ నాడి చూస్తానన్నారు. స్వామీజీ చేయి అందించారు. స్వామీజీ రెండుచేతుల్నీ పైకి ఎత్తిన ప్రేమానంద్, చూస్తుండగానే, స్వామీజీ రెండు చంకల నుండి రెండు నిమ్మకాయలు కిందపడడం భక్తులు చూచారు. చంకతో నిమ్మకాయలుగాని చేతిరుమాలు వుండగా చుట్టిగాని పెట్టి గట్టిగా నొక్కితే రక్తప్రవాహం ఆగి నాడి ఆగినట్లు అవుతుంది. హేతువాది వలన స్వామీజీ గుట్టు బయటపడిందిగాని లేకుంటే గిట్టుబాటు వ్యాపారమే!

శరీరంలో ఉష్ణోగ్రత మహత్తు:

వూళ్ళోకి స్వాములవారు వేంచేశారు. భక్తులు యధాశక్తి కానుకలు అర్పిస్తున్నారు. రోజూ ఆయన చెప్పినట్లు పూజలు చేస్తున్నారు. స్వామి ఆకర్షణీయంగా చెప్పే మాటలకు పారవశ్యం చెందుతున్నారు. కొత్తగా వచ్చిన స్వామి, రోజుకో మహత్తు చూపి భక్తులను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు.

ఆ రోజూ స్వామికోసం భక్తులు ఎదురుచూసి విసిగిపోతున్నారు. ఎంతవరకూ వేదికపైకి ఆయన రాలేదు. చివరకు శిష్యుడువచ్చి స్వామి రాకను ప్రకటించారు. స్వామివారు రాగానే, వూళ్ళో డాక్టరును పిలిపించమన్నారు. డాక్టర్ రాగానే థర్మామీటరుతో ఉష్ణోగ్రత చూడమన్నారు.