పుట:Abaddhala veta revised.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కత్తితో పైకిలేపాడు. అంతకు ముందు ప్రాయశ్చిత్త క్రతువు చేశాడు. తరువాత గర్భగుడిలో ఆమెను లింగపూజ చేయమని అందరినీ వెళ్ళిపొమ్మన్నాడు. చీకట్లో ఏదో మెదులుతుండగా ఆమె ఒక పీటతో గట్టిగా మోదింది. పూజారి తల పగిలింది. లింగం కూడా పగిలింది. తలుపు కొట్టగా బయట వేచివున్న ఆమె భర్త, హేతువాది ప్రేమానంద్ తలుపు తెరిచారు. లోగడ స్త్రీలకు సంతానప్రాప్తి ఎలా కలిగిందో దీనివలన అర్థమైంది.

మహారాష్ట్రలోని సతారాలో యిలాంటి బాబాను అంధశ్రద్ధ నిర్మూలన సమతి బట్టబయలు చేసింది.

దేవుడికి ఎన్ని రూపాలో!

దేవుడి పేరిట జరుగుతున్న ఆధ్యాత్మిక వ్యాపారం నిరంతరం కొనసాగుతున్నది. జనాకర్షణలో యిదొక వింతగా వుంటున్నది. గ్రామాలలో తరచు సాధువులు, యోగులు, బాబాలు, మాతలు ఎక్కడినుంచో వచ్చి చిన్న ప్రయోగాలు చేస్తారు. అది వింతగా చూచి, అద్భుతంగా భావించి కానుకలు సమర్పిస్తారు. గిట్టుబాటు కాగానే స్వామీజి మరో గ్రామానికి తరలివెడతాడు. ఇదంతా దైవం పేరిట జరిగే పెట్టుబడిలేని వ్యాపారమే. అలాంటి సంపాదనకు పాల్పడేవాణ్ని-డబ్బు, ఆస్తి ఎలా వచ్చిందని అడిగేవారు లేరు. మతం యొక్క గొప్పతనం అలాంటిది.

ఇంద్రియాతీత శక్తులున్నాయనే యోగి బొటనవేలి గోటిలో సోడియం దాచి, ఒక వేడినీటి పాత్రపై చేయి తిప్పినట్లు చూపి, సోడియం అందులోకి జారవిడుస్తాడు. మంత్రాలు చదువుతుంటాడు. నీటి నుండి మంటలు రావడంతో అది ఒక దైవశక్తిగా జనం భ్రమిస్తారు.

మరొక యోగిపుంగవుడు తన దివ్యమహిమ చూపడానికి నోటి నిండా నీరు నింపి సిపి ఈధర్, పొటాషియం లోహముక్కగల నీటిపాత్రలో పూస్తాడు. పొటాషియం లోహపుముక్క తగులుకొని ఈధర్ కు అంటుకోగా నీటిపై మంటలు కనిపిస్తాయి. స్వామీజీ నోటి నీటికి అంత శక్తి వున్నదన్నమాట.

ఇంకొక పవిత్ర స్వామీజీ వంటినిండా దైవం పేరు కనిపిస్తుంటుంది. ఆయన యజ్ఞం చేస్తుండగా,యిలా దైవం పేరు కనిపించడం వలన భక్తులు సాష్టాంగపడతారు. ఏదైనా పాలు కారే కొమ్మ విరిచి, దానితో దేహంపై యిష్టదైవం పేరు రాయాలి. దీని బదులు సబ్బు వాడొచ్చు. అలా రాసిన తరువాత ఆరనివ్వాలి. యజ్ఞగుండం వద్ద వేడికి స్వామీజీకి చెమట పట్టినప్పుడు స్వామీజీపై భక్తులు విభూది చల్లుతారు. అప్పుడు లోగడ రాసిన దైవనామం కనిపిస్తుంది.

ఇంకా కొందరు యోగులు కుంచెను పొటాషియం ఫెర్రొసైనైడ్ ద్రావణంలో ముంచి చేతిమీద దైవనామం రాసి ఆరబెడతారు. ఐరన్ క్లోరైడ్ ద్రావకంలో దూదిగాని,వస్త్రంగాని ముంచి లోగడ దైవనామం రాసినచోట తుడిస్తే నీలం రంగులో ప్రత్యక్షమై, భక్తుల్ని ఆశ్చర్యపరుస్తుంది.