పుట:Abaddhala veta revised.pdf/70

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఇలాంటి చిత్రవిచిత్రాలతో అమాయకులైన, అజ్ఞానులైన భక్తుల్ని మోసగించి, భ్రమింపజేసి తాత్కాలికంగా లబ్ధిపొందవచ్చు.

చిట్కాలతో సంతానం

పిల్లలు పుట్టని వారికి మానసిక బలహీనత వుంటుంది. ఎలాగైనా సరే సంతానం పొందాలి. ఆ బలహీనతను ఆసరాగా తీసుకొని ఇరుగుపొరుగువారు సలహాలు చెబుతుంటారు. మొక్కుబడులు చేయిస్తుంటారు. గుడులకు పంపిస్తుంటారు, అంతటితో ఆగక,బాబాలకు, మాతలకు పరిచయం చేస్తుంటారు. సంతానం కలిగిస్తామని చెప్పే బాబాలు అనేక చిట్కాలు చేయిస్తారు. ధనాన్ని వివిధ రూకాలుగా రాబడతారు. కొందరు ఇళ్ళలో తిష్టవేసి ఏవేవో పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, క్రతువులు చేయిస్తారు. ఆ విధంగా ఖర్చుపెట్టి ఆరిపోయిన వారున్నారు. అయితే సంతాన ఆశ వారిచేత ఏ పనైనా చేయిస్తుంది. ఎంతకూ తమ ఖర్మ అనుకుంటారే గాని, చేస్తున్న పనులకూ, సంతాన ప్రాప్తికీ సంబంధం లేదని గ్రహించరు.

ఒక స్వామి సంతానప్రాప్తి పరీక్షగా పాత్రలో బియ్యం పోసి, కత్తి అందులో దింపి, కత్తితో పైకెత్తినప్పుడు పాత్ర పైకిలేస్తే, సంతానప్రాప్తి కలుగుతుందనీ, లేకుంటే లేదనీ చెబుతాడు. హేతువాది ప్రేమానంద్ కొన్ని వేల పర్యాయాలు ఈ చిట్కా వేసి చూపెట్టాడు. దీనికి సంతానానికి ఎలాంటి కార్యకారణ సంబంధం లేదని స్పష్టం చేశాడు.

అడుగుభాగం వెడల్పుగానూ, మూతివద్ద సన్నంగానూ వుండే పాత్ర తీసుకోండి. అందులో బియ్యం నింపి, ఒక నిడువైన కత్తితో పొడుస్తూ వుండండి. బియ్యం పాత్ర అడుగున బాగా బిగుసుక పోయినప్పుడు కత్తిని అడుగువరకూ దింపి, పిడి పట్టుకొని పైకి ఎత్తితే బియ్యం పాత్ర పైకి లేస్తుంది. బియ్యం బాగా బిగుసుకు పోవడం యిక్కడ ముఖ్యం. అలా జరిగిన తరువాత కత్తిని దింపితే, గట్టిగా పట్టుకుంటుంది. దీనికీ సంతానానికీ ముడిపెట్టడం హేతుబద్ధం కాదు. అయినా ఇదొక గొప్ప విషయంగా నమ్మేవారున్నారు.

రక్తంతో కైంకర్యం

గ్రామాలలో అప్పుడప్పుడు భీభత్స దృశ్యాలు చూస్తాం. జుట్టు విరబూసుకొని, చొక్కాలేకుండా, పూసలు, రుద్రాక్షలు ధరించిన భక్తుడు,మాంత్రికుడు, ఫకీరు యింకా యిలాంటివారు తమ శరీరాన్ని కొరడాతో కొట్టుకుంటారు. కొందరు కత్తితో చేతుల్ని, కాళ్ళని కోసుకొని రక్తమయం చేస్తారు. అది చూచి భక్తులు కానుకలు సమర్పిస్తారు.

శరీరం మీద గాని లేదా చేతులపై గానీ ఫెర్రోక్లోరైట్ ద్రావకం పూయాలి. సోడియం సల్ఫోసనైడ్ ద్రావకంలో కత్తిని ముంచాలి. ఎక్కడ ఫెర్రిక్లోరైడ్ పూసారో, అక్కడ కత్తితో నరికినట్లు నటిస్తే రక్తపు చారలు వచ్చినట్లు కనిపిస్తుంది. జనం వెళ్ళిపోయిన తరువాత తడిబట్టతో తుడిచేయవచ్చు.