పుట:Abaddhala veta revised.pdf/358

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కూడా.కాని,శాస్త్రీయం అని రుజువు కాని వైద్యానికి ప్రభుత్వం నిధులు యివ్వరాదు. ప్రముఖ శాస్త్రజ్ఞులు డా॥ పి.ఎం.భార్గవ ఆ మాట అంటే, తిట్టారు, ఆయనపై దాడిచేశారు గాని, సమాధానం రాలేదు. ప్రజలలో మూఢనమ్మకాలు మత మౌఢ్యాలు వున్నట్లే, హోమియో వంటి చికిత్సలూ వున్నాయి. దీనికి హేతువాదులు, నాస్తికులు గురిగావడం విచారకరం. నేను జర్నలిస్టుగా పనిచేస్తుండగా హోమియోపై విమర్శ చేస్తే ఒక కమ్యూనిస్టు జర్నలిస్టు మిత్రుడు వచ్చి, విమర్శలు మానేయమన్నాడు. ఎందుకు అని అడిగితే, హోమియో కళాశాలలో తమ పార్టీ నాయకత్వాన యూనియన్ వున్నదని, వారికి బాధగా వున్నందున సహకరించమన్నాడు. అంతేగాని శాస్త్రీయం కాదనే విమర్శలకు సమాధానం రాలేదు.

మనదేశంలో అన్ని వైద్యాలను ముఖ్యంగా అలోపతిని పూర్తిగా నిషేధించి, హోమియోను విధిగా అందరూ స్వీకరించాలని నిర్భధం పెడితే కుటుంబ నియంత్రణ సమస్య అతివేగంగా పరిష్కారమౌతుంది.

- నాస్తికయుగం, అక్టోబరు-నవంబరు 2000
హోమియో శాస్త్రీయమని ప్రపంచంలో
ఎక్కడా రుజువుకాలేదు!

హోమియోపతి శాస్త్రీయమని ప్రపంచంలో ఇంతవరకూ ఏ ఒక్క సందర్భంలోనూ రుజువు కాలేదు. రుజువు చేద్దామని ప్రయత్నించిన ఫ్రాన్స్, ఇంగ్లాండ్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇజ్రాయిల్, జర్మనీ దేశాల హొమియోవైద్యులు విఫలమయ్యారు. ఈ విషయంలో బ్రిటీష్ హోమియో వైద్యులకు చిత్తశుద్ధి వుంది. ఈ సంవత్సరంలోనే (1990 ఏప్రిల్) లండన్ నుండి వెలువడుతున్న బ్రిటిష్ హోమియోపతిక్ జర్నల్ త్రైమాస పత్రికలో బెర్నార్డ్ లియరీ కుండబద్దలు కొట్టి చెప్పేశారు. హోమియోపతికి మూలం జీవశక్తి అనీ, ఇది ఆధునిక శాస్త్రీయ విజ్ఞాన పద్ధతిలో రుజువు చేయజాలమనీ రాశారు. ఆధునిక పదార్థ విజ్ఞానం, రసాయన సూత్రాలలో యీ జీవశక్తి యిమడదన్నారు. అలాగే హోమియో మందులలో ఏ మేరకు మందువున్నదీ రసాయన సూత్రం ప్రకారం రుజువు చేయజాలమనీ, అవొగాడ్రొ సూత్రం అన్వయిస్తే కుదరదనీ ఒప్పేసుకున్నారు. అయితే హోమియో ఆధారపడే "జీవశక్తి"కి మూలం ఏమిటి అంటే, వివరించలేమని, స్పష్టంగా అన్నారు. అలాంటి వారితో పేచీలేదు. హోమియో శాస్త్రీయమని మొండిగా విర్రవీగేవారితోనే పేచీ.

హోమియో వాస్తవాలు కొన్ని

హోమియో శాస్త్రీయమని రుజువు పరచడానికి పాశ్చాత్య దేశాలలో ప్రయత్నాలు జరిగాయి. 1988లో డా॥జాక్ బెన్ వెనిస్తి, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ రీసర్చిలో యీ